ఇందిర పంచిన భూములను అమ్ముకున్న బీఆర్‌ఎస్ సర్కార్
మేడిగడ్డ కూలినట్టే బీఆర్‌ఎస్ సర్కార్ కూలిపోయింది
మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
యాదగిరిగుట్ట: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో నిజమైన రైతులకు అన్యాయం చేసిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పంచిన భూములను కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వం లాక్కుందని ధ్వజమెత్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు మల్లన్నసాగర్ నుంచి తాగునీటిని సరఫరా చేసేందుకు చేపట్టిన ప్రాజెక్టు కోసం యాదగిరిగుట్టలో నిర్మిస్తున్న మిషన్ భగీరథ పైలాన్ పనులకు శుక్రవారం మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి సీతక్క శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పాలనలో ప్రభుత్వ భూములు భారీగా కబ్జాకు గురయ్యాయని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు రైతుల భూములు అడుగుతుంటే బీఆర్‌ఎస్ నేతలు అడ్డుకొంటున్నారని మండిపడ్డారు. ఇబ్రహీంపట్నంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేదలకు పంచిన 20 వేల ఎకరాల భూములను బీఆర్‌ఎస్ పాలనలో కేవలం రూ.5 లక్షలు, రూ.6 లక్షలకు ఎకరం చొప్పున గుంజుకున్నారని ధ్వజమెత్తారు. నెల 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో రూ.2,000 కోట్లతో అభివృద్ధి పనులను ఉత్సవాల్లాగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.
మేడిగడ్డలాగే బీఆర్‌ఎస్ సర్కారు కూలింది: కోమటిరెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే పడిపోతుందని బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమని, వారికి మతి భ్రమించిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మేడిగడ్డ కూలినట్టే బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూలిపోయిందని చురకలంటించారు. డిసెంబర్ 6వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా బ్రాహ్మణ వెల్లంల డి్రస్టిబ్యూటరీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అంతకుముందు మంత్రులు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment