సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎస్‌ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో, ఆయనకు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.
కాగా, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం తన విచారణ జరగడం లేదంటూ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై నిన్న(బుధవారం) వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్‌పై నేడు తీర్పు వెల్లడించాల్సి ఉండగా.. గురువారం ప్రణీత్ రావు వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ సందర్బంగా కింది స్థాయి కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది.
ఇదిలా ఉండగా.. కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శ కాలను పాటించడం లేదని, పీఎస్‌లో నిద్రపోవడానికి సరైన సౌకర్యాలు లేవని, విచారణ పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరడంతోపాటు పోలీస్ కస్టడీ ఇస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రణీత్ హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. ‘24 గంటలూ ప్రణీత్‌రావును పోలీసులు విచారిస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాల్సి ఉన్నా.. దాన్ని పాటించడంలేదు. ప్రణీత్ పరువుకునష్టం కలిగించేలా అధికారులు వివరాలు మీడియాకు లీక్ చేస్తున్నారు’ అని చెప్పారు.
అనంతరం పీపీ పల్లె నాగేశ్వర్‌రావు వాదిస్తూ.. ‘పిటిషనర్ న్యాయవాది వాదనలు సరికాదు. 2023లో అక్రమంగా ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారు. ఇది చాలా తీవ్ర నేరం. నిబంధనల మేరకే ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తోంది. సాక్ష్యాలను అందించేందుకే రమేశ్ విచారణ జరిగే ప్రాంతానికి వచ్చారు తప్ప.. విచారణలో పాల్గొనలేదు’ అని చెప్పారు. ఈ వాదనలను విన్న హైకోర్టు ఈరోజు ప్రణీత్ రావు పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పును వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment