రాష్ట్ర ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఎగుమతులు 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.2.2 లక్షల కోట్లు దాటుతున్నట్టు ప్రభుత్వం అంచనా వేసింది. గత ఏడాది రాష్ట్రం నుంచి రూ.1.83 లక్షల కోట్ల మేర ఐటీ ఎగుమతులు జరగగా.. 2022–23లో ఇది 20 శాతానికిపైగా వృద్ధిరేటు సాధించినట్టు ఐటీశాఖ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో ఐటీ రంగం పురోగతికి సంబంధించిన నివేదికను ఆ శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. అన్ని అంశాలను క్రోడీకరించి జూన్ మొదటి వారంలో నివేదికను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఐటీ, ఐటీ ఆధారిత సేవల ఎగుమతుల్లో వృద్ధితోపాటు ఉద్యోగాల కల్పనలోనూ మంచి పురోగతి సాధించామని అధికార వర్గాలు చెప్తున్నాయి.
గత ఏడాది ఐటీ రంగంలో 1.53 లక్షల ఉద్యోగాల కల్పన జరగగా.. ఈసారి ఆ సంఖ్య రెండు లక్షలకు చేరి ఉంటుందని పేర్కొంటున్నాయి. గత ఏడాది ఐటీ రంగంలో దేశవ్యాప్తంగా 4.5లక్షల ఉద్యోగాల కల్పన జరగ్గా.. అందులో మూడో వంతు హైదరాబాద్ నుంచే ఉందని, ఉద్యోగాల కల్పనలో బెంగళూరు, పుణె, ముంబై, చెన్నై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలను హైదరాబాద్ అధిగమించిందని అంటున్నాయి.
ఐటీ రంగ కార్యకలాపాల విస్తరణ వల్లే..
కోవిడ్ నేపథ్యంలో పెరిగిన డిజిటలైజేషన్, తద్వారా వచి్చన కొత్త అవకాశాలను అందుకోవడంలో హైదరాబాద్‌లో ముందు వరుసలో ఉందని.. అందువల్లే శరవేగంగా వృద్ధి సాధ్యమవుతోందని ఐటీశాఖ వర్గాలు చెప్తున్నాయి. 1,500కుపైగా ఐటీ, ఐటీ ఆధారిత సేవా రంగాల కంపెనీలతో హైదరాబాద్ ఐటీ హబ్‌గా మారిందని అంటున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీని విస్తరించడంలో భాగంగా.. ఇప్పటికే వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో ఐటీ హబ్‌లను ప్రారంభించిందని గుర్తు చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాలకు ఐటీ రంగాన్ని విస్తరించే లక్ష్యంతో రూపొందించిన గ్రిడ్ పాలసీ ఫలితాలు ఇప్పుడిప్పుడే అందుతున్నాయని అంటున్నాయి. టీహబ్‌తోపాటు పలు ప్రైవేటు ఇంక్యుబేషన్ సెంటర్ల కార్యకలాపాలు ఊపందుకోవడంతో.. ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల కల్పనలో హైదరాబాద్ వృద్ధి ఇదే వేగంతో కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.
రాష్ట్ర ఏర్పాటు నుంచి వేగంగా..
రాష్ట్ర ఆవిర్భావ సమయంలో రూ.57,258 కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు.. 2021–22 నాటికి రూ.1.83 లక్షల కోట్లకు చేరాయి. అప్పట్లో 3.23 లక్షలుగా ఉన్న ఐటీ ఉద్యోగుల సంఖ్య 2021–22 నాటికి 7.78లక్షలకు చేరింది. అంటే ఎనిమిదేళ్లలో కొత్తగా 4.54 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది.
ఉమ్మడి ఏపీలో ఐటీ ఎగుమతులు 2035 నాటికి రూ.2.09లక్షల కోట్లకు చేరుతాయని గతంలో నిపుణులు అంచనా వేశారు. అయితే ప్రస్తుతం తెలంగాణ ఒక్కటే, 2022–23 నాటికే ఈ అంచనాలను దాటుతుండటం గమనార్హమని ఐటీ వర్గాలు చెప్తున్నాయి.
తెలంగాణలో 2026 నాటికి ఐటీ, ఐటీ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులను రూ.3 లక్షల కోట్లకు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే అంతకన్నా ముందే ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని ఐటీ శాఖ వర్గాలు చెప్తున్నాయి.
తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల సంఖ్య
ఏడాది ఐటీ ఎగుమతులు (రూ.కోట్లలో) ఉద్యోగాలు
2013–14 57,258 3,23,396
2014–15 66,276 3,71,774
2015–16 75,070 4,07,385
2016–17 85,470 4,31,891
2017–18 93,442 4,75,308
2018–19 1,09,219 5,43,033
2019–20 1,28,807 5,82,126
2020–21 1,45,522 6,28,615
2021–22 1,83,569 7,78,121
Comments
Please login to add a commentAdd a comment