సాక్షి, హైదరాబాద్: రానున్న ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2 లక్షల కోట్లకు చేరువగా బడ్జెట్ అంచనాలు ఉండనున్నట్లు సమాచారం. ఈ మేరకు 2021–22 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను నేడు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. గురువారం ఉదయం 11:30 గంట లకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు, మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి వి.ప్రశాంత్‌రెడ్డిలు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సంక్షేమం, అభివృద్ధి ప్రధానాంశాలుగా, ప్రస్తుతం అమల్లో అన్ని సంక్షేమ పథకాలు యథాతథంగా కొనసాగేలా ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలుంటాయని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీటి రంగాలకు ప్రాధాన్యమిచ్చేలా కేటాయింపులు ఉండనున్నాయి. సొంత రాబడులతో పాటు రుణాల ద్వారా, భూముల అమ్మకాలు, మార్కెట్ విలువల సవరణల ద్వారా నిధులు రాబట్టుకునే ప్రతిపాదనలు ఉంటాయని తెలుస్తోంది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి రూ.1.82 లక్షల కోట్ల అంచనాలు ప్రతిపాదించగా, ఈసారి అందుకు 10% అదనంగా రూ.2 లక్షల కోట్లకు చేరువలో ప్రతి పాదిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
రూ. 1,000 కోట్లతో దళిత జ్యోతి!
వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగించేందుకు తగినన్ని నిధులు కేటాయిస్తూ బడ్జెట్ ప్రతిపాదనలు తయారయ్యాయని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. ఆసరా పింఛన్లు, రైతుబంధు, సబ్సిడీ గొర్రెల పంపిణీ, రుణమాఫీలకు నిధులు కేటాయించనున్నట్టు సమాచారం. వీటితో పాటు రాష్ట్రంలోని దళిత వర్గాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి నేరుగా నిధులు కేటాయించే విధంగా ‘దళిత జ్యోతి’పేరుతో కొత్త పథకాన్ని కూడా ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పథకానికి తొలి ఏడాది రూ.1,000 కోట్ల నిధులు ప్రతిపాదించనున్నారని సమాచారం.
దీంతో పాటు గత ఏడాది కంటే కొంచెం ఎక్కువగా సాగునీటి ప్రాజెక్టులకు రూ. 22 వేల కోట్లు, రైతు బంధు కోసం రూ.12 వేల కోట్లు, రైతు బీమా కింద రూ. 1,200 కోట్లు, ఆసరా పింఛన్ల కోసం రూ. 12,000 కోట్లు, గొర్రెల పంపిణీకి రూ.3 వేల కోట్లు, ఆరోగ్యశ్రీ కింద రూ.1,000 కోట్లు, అన్ని స్థాయిల్లోని విద్యకు రూ.14 వేల కోట్లు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అమలు కోసం రూ.5,500 కోట్లు, ఆర్టీసీకి అదనపు సాయం కింద రూ.2,500 కోట్ల మేర నిధులు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక, ఎమ్మెల్యేలకు ఇచ్చే ప్రత్యేక అభివృద్ధి నిధి కింద ఏడాదికి రూ.3 కోట్లు, గతంలో మూసీ ప్రక్షాళన కోసం కేటాయించిన రూ.10 వేల కోట్లు కొనసాగిస్తారని సమాచారం. దీంతో పాటు బీసీ సంక్షేమానికి కూడా రూ.4 వేల కోట్ల వరకు ప్రతిపాదించనున్నట్టు తెలుస్తోంది.
జీతభత్యాలు, సబ్సిడీలకు రూ.60 వేల కోట్లు
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక రాబడులు, ఖర్చులను పరిశీలిస్తే ఈసారి బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్లు, వివిధ సబ్సిడీ పథకాల కింద రూ.50 వేల కోట్ల వరకు అవసరం కానున్నాయి. 2019–20 బడ్జెట్‌లో ఈ మూడు పద్దుల కింద రూ.40 వేల కోట్ల వరకు కేటాయించగా, 2020–21లో రూ.45 వేల కోట్లు ప్రతిపాదించారు. ఈసారి అది రూ.50 వేల కోట్లకు చేరుతుందని, కొత్తగా ప్రకటించనున్న పీఆర్సీ కింద మరో రూ.8 వేల కోట్లు అవసరం అవుతాయని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేశాయి. మొత్తం మీద ఈ మూడు పద్దులకు రూ.60 వేల కోట్లు అవసరం అవుతాయని, రుణాల చెల్లింపులు, వడ్డీల కోసం రూ.20 వేల కోట్ల వరకు అవసరం అవుతాయని ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇవి పోను, సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు కోసం, రెవెన్యూ ఖర్చు కింద రూ.1.20 లక్షల కోట్ల వరకు ప్రతిపాదనలు ఉండనున్నాయి. కాగా నిరుద్యోగ భృతి, 57 ఏళ్లకే పింఛన్ లాంటి ఎన్నికల హామీల అమలుకు ఈసారి నిధుల కేటాయింపులు అనుమానమేననే చర్చ ఆర్థికశాఖ వర్గాల్లో జరుగుతోంది. వీటికి నిధులు ప్రతిపాదించాలంటే మరో రూ.10 వేల కోట్ల వరకు అవసరం అవుతాయని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి.
రాబడులు పెంచుకునే విధంగా...
బడ్జెట్ పద్దులో ప్రభుత్వ అనివార్య ఖర్చులు ఏటేటా పెరుగుతుండటంతో రాబడులను పెంచుకోవడం కూడా అనివార్యమవుతుందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు చెపుతున్నారు. దీంతో పాటు ఈ ఏడాది కరోనా కొట్టిన దెబ్బకు అప్పుల ద్వారా పెద్ద మొత్తంలో నిధులు సమీకరించినా ప్రభుత్వం ఆశించినంత మేర పద్దులెక్క చేరుకోలేదు. రూ.50 వేల కోట్ల వరకు ఆదాయంపై ప్రభావం పడినందున ఈసారి బడ్జెట్‌లో సొంత నిధుల సమీకరణ ప్రతిపాదనలు ఉంటాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా భూముల అమ్మకాలు, భూముల మార్కెట్ విలువ సవరణల ద్వారా నిధులు సమీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఊపందుకున్న రియల్ వ్యాపారంతో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఏడాది రూ.1,000 కోట్లు అదనంగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం లెక్కలు కడుతోంది. దీనికి తోడు భూముల మార్కెట్ విలువలను సవరిస్తే గరిష్టంగా మరో రూ.4 వేల కోట్ల వరకు సమీకరించుకునే అవకాశం ఉంది.
ఎక్సైజ్ డ్యూటీల కింద కూడా గత బడ్జెట్ కంటే రూ.1,000 కోట్లు అదనపు అంచనాలు ప్రతిపాదించనున్నారు. ఇక, భూముల అమ్మకాల విషయానికి వస్తే రాజీవ్ గృహకల్ప, దిల్, కోకాపేట, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో ఉన్న భూములను అమ్మడం ద్వారా రూ.20 వేల కోట్లకు పైగా సమకూర్చుకునే ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉన్నాయి. కానీ ప్రతి యేటా ఈ భూముల అమ్మకాల ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. కానీ ఈసారి సొంత ఆదాయ పెంపు అనివార్యం కావడంతో నిరుపయోగంగా, రక్షణ కష్టంగా ఉన్న భూముల అమ్మకాల ద్వారా రూ.10 వేల కోట్ల వరకు సమకూర్చుకునే ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వీటికి తోడు రుణాల ద్వారా ఈసారి రూ.40 నుంచి 50 వేల కోట్ల వరకు సమకూర్చుకునే ప్రతిపాదనలు పెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment