సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయముంది. అయితే ముందస్తు ఎన్నికలు జరగవచ్చనే ప్రచారం జరుగుతోంది. దీంతో అన్ని పారీ్టలూ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతూ కార్యాచరణకు దిగుతున్నాయి. ఇదే క్రమంలో ఆరు నెలలకు ముందే నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అసెంబ్లీ టికెట్ ఆశావహులు తమ నియోజకవర్గాలను పదిలం చేసుకునే పనిలో పడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అసెంబ్లీ బరిలో ఉండాలని, తమ అదృష్టం పరీక్షించుకోవాలనే ధ్యేయంతో ఇప్పటినుంచే ఆయా స్థానాల్లో కరీ్చఫ్‌లు వేసుకుంటూ ఇటు అధిష్టానానికి, అటు పార్టీ కేడర్‌కు సంకేతాలిస్తున్నారు.
మాజీ ఎంపీలు.. మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎంపీలు..ప్రస్తుత ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, పార్టీల జిల్లా అధ్యక్షులు ఇతరులతో పాటు కొత్తగా అసెంబ్లీ బరిలోకి దిగాలనుకునే వారు కూడా తమతమ నియోజకవర్గాలపై దృష్టి కేంద్రీకరించి కార్యక్రమాలు చేపడుతున్నారు. అవసరమైతే పార్టీ మారైనా సరే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కొందరు పట్టుదలతో ఉన్నారు. రాష్ట్రంలోని మూడు రాజకీయ పక్షాలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు పలువురు ఎలాగైనా పార్టీ బీ–ఫారం తెచ్చుకునేలా పావులు కదుపుతున్నారు. నియోజకవర్గాల్లో ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
గద్వాల జిల్లాలో..
జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్‌ను టీఆర్‌ఎస్ నుంచి జడ్పీ చైర్‌పర్సన్ సరిత ఆశిస్తున్నారు. ఆలంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని మాజీ ఎంపీ మంద జగన్నాథం భావిస్తున్నారు. కొల్లాపూర్ నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన జూపల్లి కృష్ణారావు తాను మళ్లీ అక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్తున్నారు. అవసరమైతే పార్టీ మారేందుకు కూడా సిద్ధమవుతున్నారని ఆయన సన్నిహితులు చెపుతున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కుమార్తె స్నిగ్ధారెడ్డి గద్వాలఅసెంబ్లీపై కరీ్చఫ్ వేశారు. డీకే అరుణ గద్వాల లేదా మహబూబ్‌నగర్ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి మక్తల్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
నిజామాబాద్‌లో..
ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఈసారి వీలైతే అసెంబ్లీకి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. బీజేపీకి చెందిన ముఖ్య నేతలంతా ఇదే ఆలోచనలో ఉన్నారు. ముందుగా అసెంబ్లీకి పోటీ చేసి ఆ తర్వాత పరిస్థితిని బట్టి పార్లమెంటుకు పోటీ చేయాలని యోచిస్తున్నారు. ఎంపీ అరవింద్ ఆర్మూర్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. బాల్కొండ నుంచి మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ కుమారుడు మల్లికార్జున్‌రెడ్డి.. తాను బీజేపీ నుంచి పోటీ చేస్తానని కేడర్‌కు చెపుతున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ కూడా ఆర్మూర్ లేదా నిజామాబాద్ అర్బన్ స్థానాలపై కరీ్చఫ్ వేశారు. అయితే.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఆర్మూర్ నుంచి పోటీ చేయించాలని అక్కడి జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రతిపాదిస్తుండటం గమనార్హం. గతంలో జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసిన కలకుంట్ల మదన్‌మోహన్‌రావు ఈసారి ఎల్లారెడ్డి అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఖమ్మంలో..
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాను పాలేరు నుంచి టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేస్తానని ఇటీవల స్పష్టం చేశారు. అయితే అక్కడ కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన కందాల ఉపేందర్‌రెడ్డి ఉండడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. గతంలో సత్తుపల్లిలో కాంగ్రెస్ మద్దతుతో టీడీపీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన సండ్ర వెంకటవీరయ్యపై మళ్లీ పోటీ చేసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత సంభాని చంద్రశేఖర్ సిద్ధమవుతున్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు ఈసారి టీఆర్‌ఎస్ టికెట్ అనుమానమే అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు శిబిరం ఈసారి టికెట్ తమదేనని చెప్పుకుంటోంది. మరోవైపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
నల్లగొండలో..
ప్రస్తుత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈసారి నల్లగొండ అసెంబ్లీ నుంచే పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా హుజూర్‌నగర్ అసెంబ్లీ నుంచి మళ్లీ పోటీ చేయనున్నారు. భువనగిరి ఎంపీగా పోటీ చేసిన ఓడిపోయిన టీఆర్‌ఎస్ నేత డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ ఈసారి మునుగోడు లేదా ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నుంచి బరిలో ఉంటాననే సంకేతాలు ఇస్తున్నారు. ఈమేరకు ఆయా నియోజకవర్గాల్లో తరచూ పర్యటిస్తున్నారు. యువ తెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేసిన జిట్టా బాలకృష్ణారెడ్డి ఆ పార్టీ నుంచి భువనగిరి అసెంబ్లీ స్థానంపై కరీ్చఫ్ వేశారు.
ఆదిలాబాద్‌లో..
ఆదిలాబాద్ జడ్పీ చైర్ పర్సన్ రాథోడ్ జనార్దన్ టీఆర్‌ఎస్ నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెపుతున్నారు. మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ బెల్లంపల్లి నుంచి, బోథ్ నుంచి మాజీ ఎంపీ గొడం నగేశ్ సై అంటున్నారు. మాజీ ఎంపీ వేణుగోపాలాచారి ముథోల్ అసెంబ్లీ స్థానం కరీ్చఫ్ వేయగా, బీజేపీ నుంచి ఎంపీగా ఉన్న సోయం బాపూరావు కూడా ముథోల్ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఇందుకోసం వీరంతా ఆయా నియోజకవర్గాల్లో పర్యటనలు, కార్యక్రమాలు చేస్తూ పోటీలో ఉన్నట్టు సంకేతాలిస్తున్నారు.
కరీంనగర్‌లో..
కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ వేములవాడ అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మాజీ ఎంపీ వివేక్ కూడా ధర్మపురి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. మంథనిలో పీవీ నర్సింహారావు కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి టీఆర్‌ఎస్ నుంచి బరిలో ఉంటారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి జగిత్యాల నుంచి కాంగ్రెస్ టికెట్‌పై మరోమారు బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
రంగారెడ్డిలో..
మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ పక్షాన పోటీ చేయాలని హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అనితారెడ్డిలు ఆసక్తితో ఉన్నారు. ఇక్కడి నుంచి మంత్రి సబిత ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ టికెట్ తమకేనని కేడర్‌కు చెప్పుకుంటున్నారు. కల్వకుర్తి సీటుపై ప్రస్తుత ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిలు ఇద్దరూ కరీ్చఫ్ వేసుకుని కూర్చున్నారు. ఇలావుండగా మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి షాద్‌నగర్ అసెంబ్లీ బీజేపీ టికెట్ తనకేననే ధీమాతో ఉన్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో కార్యరంగంలోకి దిగి పనిచేస్తున్నారు. సునీతా మహేందర్‌రెడ్డి పరిగి అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు. కిషన్‌రెడ్డి పోటీలో లేనిపక్షంలో ఇబ్రహీంపట్నం నుంచి పోటీకి కుమారుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ మహిపాల్ కాంగ్రెస్ తరఫున చేవెళ్ల లేదా ఎంపీ కోమటిరెడ్డి ఆశీస్సులతో నల్లగొండ జిల్లా నకిరేకల్ నుంచి పోటీ చేయాలనే యోచనలో ఉన్నారు. రెండు చోట్లా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
హైదరాబాద్‌లో..
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానని బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు. అంబర్‌పేట అసెంబ్లీ నుంచి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సతీమణి, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి సనత్‌నగర్ నుంచి ఆ పార్టీ తరఫున పోటీకి సిద్ధమవుతున్నారు. ఖైరతాబాద్ అసెంబ్లీ నుంచి టీఆర్‌ఎస్ టికెట్‌పై పోటీ చేస్తానని మాజీ సీఎల్పీ నేత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి సంకేతాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment