
ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘం నామినేషన్ల స్వీకరణ తుది గడువుకు 10 రోజుల ముందు వరకు ఓటర్ల నమోదు దరఖాస్తులు స్వీకరించి, సత్వరంగా వాటి ని పరిష్కరించి అనుబంధ ఓటర్ల జాబితాను ప్రచురించనుంది.
సాక్షి, హైదరాబాద్: పట్ట భద్రుల శాసన మండలి నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో ఇంకా పేరు నమోదు చేసుకోలేక పోయారా? అయితే ఓటరుగా నమోదు కావడానికి మీకు మరో అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘం నామినేషన్ల స్వీకరణ తుది గడువుకు 10 రోజుల ముందు వరకు ఓటర్ల నమోదు దరఖాస్తులు స్వీకరించి, సత్వరంగా వాటి ని పరిష్కరించి అనుబంధ ఓటర్ల జాబితాను ప్రచురించనుంది. ఈ అనుబంధ ఓటర్ల జాబితాలో చోటు సంపాదించిన వారికి ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించనుంది. మహబూబ్‌నగర్– రంగారెడ్డి– హైదరాబాద్ స్థానంతో పాటు వరంగల్–ఖమ్మం– నల్లగొండ పట్టభద్రుల స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెల 23తో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుంది.
నామినేషన్ల స్వీకరణ గడువు ముగింపునకు 10 రోజుల ముందు అంటే ఈనెల 13 అర్ధరాత్రి వరకు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో ఓటరు నమోదు దరఖాస్తులు స్వీకరించి, అర్హులకు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ గురువారం ‘సాక్షి’కి తెలిపారు. ‘వరంగల్’ పట్టభద్రుల మండలి స్థానం పరిధిలో మొత్తం 4,91,396 మంది, ‘మహబూబ్‌నగర్’ పట్టభద్రుల మండలి స్థానం పరిధిలో 5,17,883 మంది గత నెలలో ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో చోటు సంపాదించారు.
చదవండి: పట్టభద్రులు ఓటు ఇలా నమోదు చేసుకోండి
కాగా తెలంగాణలో ఖమ్మం - వరంగల్-నల్గొండ, మహబూబ్‌నగర్ - రంగారెడ్డి -హైదరాబాద్ పట్టభద్రుల స్థానాలకు ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుండగా.. మార్చి 14న పోలింగ్ జరుగనుంది. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 23వ తేదీ వరకు గడువు ఇచ్చారు. 24న నామినేషన్లను పరిశీలించన్నారు. 26న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు ఇచ్చారు. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ప్రస్తుత ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎన్.రామచంద్రరావు పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది.
చదవండి: మేయర్ ఎన్నిక: వారు అలా.. వీరు ఇలా..
రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్