సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా వేదికగా విపక్షాలు ముఖ్యంగా బీజేపీ చేస్తున్న దాడిని చట్టపరంగా ఎదుర్కోవాలని టీఆర్‌ఎస్ భావిస్తోంది. వ్యక్తిగత దూషణలు, కార్టూన్లు, క్యారికేచర్లు వంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. బీజేపీ జాతీయ స్థాయి నేతలు మొదలుకుని స్థానిక బడా, చోటా నేతలు పెడుతున్న పోస్ట్‌లు అభ్యంతరకరంగా పేర్కొంటూ వాటిపై చట్టపరమైన చర్యలకు డిమాండ్ చేయాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగానే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ఇటీవల ఫిర్యాదు చేసింది. అలాగే ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వివిధ వ్యక్తులు, గ్రూప్‌ల పేరిట ఏర్పాటు చేసిన ఖాతాలను గుర్తించే పనిలో టీఆర్‌ఎస్ సోషల్ మీడియా విభాగం నిమగ్నమైంది. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర ముఖ్యనేతలను లక్ష్యంగా చేసుకుని అసభ్యపదజాలంతో దూషణలు, కార్టూన్లు, కేరికేచర్లు, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్న వారిపై దృష్టి సారించింది.
ఎక్కడికక్కడ ఫిర్యాదులు.. ఎప్పటికప్పుడు బ్లాక్
దుష్ప్రచారం చేస్తున్న వారిపై ఎక్కడికక్కడ పోలీసులకు ఫిర్యాదు చేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలను టీఆర్‌ఎస్ ఆదేశించింది. అసత్య ప్రచారం చేస్తున్న వారిపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం నిబంధనల కింద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో తెలియచేస్తూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తోంది. గతంలో బీజేపీ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్‌తో పాటు మరికొందరిపై పోలీసు కేసులు నమోదు కాగా, వనస్థలిపురం పోలీసు స్టేషన్‌తో పాటు ఒకటి రెండు చోట్ల నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై కూడా టీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదులతో కేసులు నమోదయ్యాయి.
చట్టపరమైన చర్యలతో పాటు ఆయా సోషల్ మీడియా వేదికల్లో ఉన్న సాంకేతిక అవకాశాలను కూడా ఉపయోగించుకుని అసత్య ప్రచారాలు, అసభ్య వ్యాఖ్యలు, మార్ఫింగ్ ఫొటోలు తదితరాలను బ్లాక్ చేయాల్సిందిగా రిపోర్ట్ చేయాలని పార్టీ సోషల్ మీడియా గ్రూప్‌లకు టీఆర్‌ఎస్ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది.
సోషల్ మీడియా ద్వారానే ఎదురుదాడి
రాష్ట్రానికి చెందిన బీజేపీ జాతీయ స్థాయి నేతలు కూడా సోషల్ మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్న టీఆర్‌ఎస్.. వారిపై ఎదురుదాడికి దిగాలని భావిస్తోంది. ఇన్నాళ్లూ పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల ప్రచారంపైనే దృష్టి కేంద్రీకరించిన టీఆర్‌ఎస్ ఇకపై.. విపక్షాలు ప్రత్యేకించి బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారానే తిప్పికొట్టడంతో పాటు ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది.
ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేపడుతున్న కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటికే గ్రామ స్థాయి మొదలుకుని జిల్లా, పట్టణ స్థాయి వరకు సోషల్ మీడియా కమిటీలు ఏర్పాటయ్యాయి. త్వరలో ఏర్పాటయ్యే పార్టీ రాష్ట్ర కమిటీతో పాటు అనుబంధంగా సోషల్ మీడియా విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్ తాజాగా నిర్ణయించింది.
తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టం
సోషల్ మీడియా వేదికగా విపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలకు అడ్డులేకుండా పోయింది. జాతీయ పార్టీలకు చెందిన పెద్ద నాయకులు కూడా తమ స్థాయిని మరిచి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. వీటిపై చట్టపరంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. సోషల్ మీడియాలో వీరి ఆగడాలను అడ్డుకునే వారికి వస్తున్న బెదిరింపులపై కూడా ఫిర్యాదు చేయాలని మా సోషల్ మీడియా కమిటీల బాధ్యులకు చెబుతున్నాం.
– వై.సతీష్‌రెడ్డి, స్టేట్ కన్వీనర్, టీఆర్‌ఎస్ సోషల్ మీడియా వింగ్
Comments
Please login to add a commentAdd a comment