అమెరికాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి | Telugu Student Dies Suspiciously In America, Check More Details Inside | Sakshi
Sakshi News home page

అమెరికాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి

Published Mon, Dec 23 2024 8:27 AM | Last Updated on Mon, Dec 23 2024 10:55 AM

Telugu student dies suspiciously in America

మాదన్నపేటలో విషాదం

మృతదేహాన్ని త్వరగా తెప్పించాలని గ్రామస్తుల వినతి

కమలాపూర్‌: హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం మాదన్నపేటకు చెందిన విద్యార్థి బండి వంశీ(25) శనివారం రాత్రి అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మాదన్నపేటలో కల్లుగీత వృత్తితో పాటు వ్యవసాయం చేసుకుని జీవనం సాగించే బండి రాజయ్య–లలిత దంపతులకు ఇద్దరు కుమారులు. వీరి చిన్న కుమారుడు వంశీ సుమారు రెండేళ్ల క్రితం ఉన్నత చదువుల(ఎంఎస్‌) కోసం అమెరికాకు వెళ్లాడు.

 కాంకోర్డియా సెయింట్‌ పాల్‌ విశ్వవిద్యాలయం చదువుతూ.. 8580 మాగ్నోలియా ట్రైల్‌ ఈడెన్‌ ప్రెయిరీ అపార్ట్‌మెంట్‌, రూం నంబర్‌ 206, మిన్నెసోటా 55344లో ఉంటున్నాడు. శనివారం రాత్రి అపార్ట్‌మెంట్‌ కింద ఉన్న సెల్లార్‌లో పార్కుచేసి కారులో వంశీ ఉరి వేయబడి అనుమానాస్పద స్థితితో మృతి చెందాడు. సమాచారం అందుకున్న అక్కడి పోలీసులు మృతదేహాన్ని తరలిస్తున్న సమయంలో.. పక్క అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న కంఠాత్మకూర్‌ వాసి విషయాన్ని ఫోన్‌ ద్వారా తన తల్లిదండ్రులకు తెలుపగా వారు వంశీ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. 

వంశీ మృతితో మాదన్నపేటలో విషాదం అలుముకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వంశీ మృతదేహాన్ని త్వరితగతిన స్వస్థలానికి తెప్పించాలని, మృతికి కారకులను చట్టపరంగా శిక్షించేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరారు. ఇదిలా ఉండగా.. వంశీ మృతి విషయాన్ని స్థానిక బీజేపీ నాయకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ దృష్టికి తీసుకెళ్లి మృతదేహాన్ని త్వరగా తీసుకొచ్చేలా చూడాలని కోరినట్లు పేర్కొన్నారు.

మృతదేహాన్ని తెప్పించేందుకు కృషి చేస్తా : ప్రణవ్‌
అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వంశీ మృతదేహాన్ని ప్రభుత్వ పరంగా వీలైనంత త్వరితగతిన స్వగ్రామానికి తెప్పించేందుకు తన వంతుగా కృషి చేస్తానని కాంగ్రెస్‌ పార్టీ హుజూరాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఒడితల ప్రణవ్‌ తెలిపారు. ఆయన మాదన్నపేటకు వెళ్లి వంశీ తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. కుటుంబానికి ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement