రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారి తిరుకల్యాణానికి పట్టు వస్త్రాలు అందజేస్తున్న దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు
సాక్షి, యాదాద్రి/యాదగిరిగుట్ట: యాదగిరీంద్రుని తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం తులా లగ్న పుష్కరాంశ సుముహూర్తమున బాలాలయంలో లక్ష్మీదేవితో యాదగిరీంద్రునికి తిరుకల్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. స్వామివారిని శ్రీరామ అలంకారం చేసి హనుమంత వాహన సేవ నిర్వహించారు. హనుమద్వాహనరూఢుడైన శ్రీస్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. అనంతరం పంచరాత్రా ఆగమ శాస్త్రం ప్రకారం స్వామి, అమ్మవార్లను అలంకరించి తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు.
ఉదయం 11.05 గంటలకు ప్రారంభమైన కల్యాణంలో ప్రధాన ఘట్టమైన జీలకర్రబెల్లం పెట్టే కార్యక్రమం 12.50కి పూర్తికాగా.. మాంగళ్య«ధారణ మహోత్సవం 12.57 గంటలకు జరిగింది. కన్యాదానం, మాంగళ్యధారణ, తలంబ్రాలు మొదలైన కల్యాణ ఘట్టాలను ఆలయ అర్చకులు వేద మంత్రాల మధ్య నిర్వహించారు. మధ్యాహ్నం 1.15 గంటలకు కల్యాణోత్సవం పూర్తయ్యింది.
స్వామి వారిని మల్లె, మందార, పున్నాగ, జాజి, వకుళ, కేతకి, చంపక, మల్లిక వంటి పుష్పాలతో.. చంద్రహారం, పగడాలు, ఇతర హారాల వంటి బంగారు కంఠాభరణాలతో అలంకరించి గజవాహనసేవ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, టీటీడీ తరఫున టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి వైవీ స్వర్ణలతారెడ్డి స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు.
యాదాద్రీశుడి ప్రధానాలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం మంత్రి దంపతులు, కుటుంబ సభ్యులు, తన నియోజకవర్గ ప్రజల తరఫున రూ.99,08,454 ఈవో గీతారెడ్డికి అందజేశారు.శ్రీస్వామి వారి కల్యాణోత్సవం సందర్భంగా మహామండపంలోని కల్యాణమూర్తు ల ముందు మంత్రి రూ.36,01,454 చెక్కులు, రూ.63,07,000 నగదు రూపంలో ఈవోకు ఇచ్చారు.
టీటీడీ తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు అందజేస్తున్న స్వర్ణలతారెడ్డి
సీఎం పర్యటన రద్దు
యాదాద్రీశుడి సన్నిధికి ఉదయం రావాల్సిన సీఎం కేసీఆర్ పర్యటన రద్దయింది. స్వామివారి తిరు కల్యాణంలో సతీసమేతంగా పాల్గొని, ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారని ముందుగా అధికారులు ప్రకటించారు. అయితే, అనారోగ్య సమస్యతో సీఎం పర్యటన 10 గంటలకు రద్దయినట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment