సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరోసారి పులులు జనారణ్యంలోకి చొరబడటంతో కలకలం రేగింది. కుమురంభీం జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి ఇప్పటికే ఓ యువకుడి ప్రాణాలు తీయగా దాని జాడ ఇంకా కానరాలేదు. శుక్రవారం జిల్లాలోని బెజ్జూర్ మండలం అంబగట్ట గ్రామ సమీపంలోని గట్టుచెరువు అటవీ ప్రాంతంలో శుక్రవారం పెద్దపులి హల్‌చల్ చేసింది. మేకల కాపరులు కొండయ్య, ఉపేందర్‌కు పులి తారసపడటంతో ప్రాణాలను కాపాడుకోవటానికి చెట్టెక్కారు.
పులి సంచరిస్తున్న విషయంపై కర్జెల్లి రేంజ్ అధికారి రాజేందర్ పశువుల కాపరుల వద్ద నుంచి వివరాలను సేకరించారు. అలాగే మంచిర్యాల జిల్లా వేమనపల్లి ముక్కిడిగూడెం అడవుల్లో పులి సంచరిస్తోంది. గురువారం అడవిలోకి వెళ్లిన వేమనపల్లికి చెందిన మేకల కాపరి దేవనబోయిన భానేశ్‌కు పులి తారసపడింది. దీంతో సదరు యువకుడు ప్రాణభయంతో పరుగులు తీయగా.. మేకలు చెల్లాచెదురై ఇంటి ముఖం పట్టాయి. రెండు రోజుల కిందట ముక్కిడిగూడెం శివారులోని పత్తి చేన్లలోకి పులి వచ్చి వెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పాతజాజులపేట మీదుగా ప్రాణహిత నది వరకు వచ్చి అంపుడొర్రె నుంచి పులి అడవిలోకి వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు.
(చదవండి: ఐదు రోజులాయే.. పులి బోనులో చిక్కేనా..?)
మేకల్ని చంపి దర్జాగా..
అనంతపురం/పామిడి: పామిడి మండలంలోని దిబ్బసానిపల్లిలో శుక్రవారం చిరుత కలకలం రేపింది. ఆ గ్రామానికి చెందిన మనోజ్ మేకలను శివారు ప్రాంతానికి మేత కోసం తోలుకెళ్లాడు. అదే సమయంలో చిరుత ఒక్కసారిగా మేకల మందపై పంజా విసిరింది. ఈ దాడిలో మూడు మేకలు మృతి చెందగా.. కొన్ని గాయపడ్డాయి. అప్రమత్తమైన మనోజ్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అటవీశాఖ అధికారులు చిరుత నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ఇక మేకలపై దాడి చేసిన అనంతరం పులి దర్జాగా ఓ బండరాళ్ల గుట్ట ప్రాంతంలో సంచరిస్తున్న దృశ్యాల్ని స్థానిక యువకులు తమ సెల్ ఫోన్లలో చిత్రించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment