హైదరాబాద్: పంజాగుట్టలోని ఓ అపార్ట్‌మెంట్‌లో మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగతో తల్లీ, కూతురు ప్రాణభయంతో కేకలు పెట్టారు. ఈ సమాచారం అందుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్ హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి తన ప్రాణాలనుసైతం లెక్కచేయకుండా తల్లీకూతుళ్లను రక్షించారు. పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ బి.శ్రావణ్‌కుమార్ శనివారం సాయంత్రం 3.30 గంటల ప్రాంతంలో పంజాగుట్ట జూబ్లీమెడికల్ షాపుపైన మంటలు వ్యాపిస్తున్నట్లు సమాచారం అందుకుని వెంటనే అక్కడికి వెళ్లారు.
అప్పటికే అపార్ట్‌మెంట్‌లో మంటలు వ్యాపించడంతో పాటు దట్టంగా పొగలు అలుముకున్నాయి. మెట్లపై నుంచి వెళ్లేందుకు వీలులేకపోవడంతో డ్రెయినేజీ పైప్ ద్వారా పైకెక్కిన శ్రావణ్‌కు నాలుగో అంతస్తులోని ఫ్లాట్‌లో మౌనిక (13) కేకలు వినిపించాయి. వెంటనే ఆ ఫ్లాట్‌లోకి దూకి చిన్నారిని రక్షించి టెర్రస్ పైకి తీసుకెళ్లారు. తిరిగి అదే ప్లాట్‌లోకి వచ్చి మౌనిక తల్లి మహేశ్వరి (35)ని సైతం రక్షించారు. కొద్దిసేపటి తరువాత మంటలు అదుపులోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సాహసాన్ని తెలుసుకున్న ట్రాఫిక్ ఏసీపీ జ్ఞానేందర్‌రెడ్డి శ్రావణ్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment