సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: రాష్ట్ర శాసనసభ ఎన్నికల విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై 20 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, నాన్ కేడర్ ఎస్పీలపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో రాష్ట్ర పరిపాలనపై దఖలుపడిన అధికారం మేరకు ఈ చర్య తీసుకుంది. హైదరాబాద్ సీపీ సహా ముగ్గురు పోలీసు కమిషనర్లు, నాలుగు జిల్లాల కలెక్టర్లు, 10 జిల్లాల ఎస్పీలు, ఓ శాఖ కార్యదర్శి, మరో శాఖ డైరెక్టర్, ఇంకో శాఖ కమిషనర్లపై బదిలీ వేటు వేసింది.
వీరిలో 18 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, నాన్ కేడర్ ఎస్పీలకు శాసనసభ ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదని ఆంక్షలు విధించింది. బదిలీ అయిన అధికారులు సత్వరమే బాధ్యతల నుంచి తప్పుకొని తమ తర్వాతి స్థానంలో ఉన్న అధికారికి బాధ్యతలు అప్పగించాలని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కూడా వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, దేవాదాయ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతల నుంచి తక్షణమే వైదొలగాలని ఆదేశించింది.
ఈ మూడు శాఖలకు కొత్త ముఖ్య కార్యదర్శులతోపాటు బదిలీ వేటుపడిన 20 మంది అధికారుల స్థానంలో గురువారం సాయంత్రం 5 గంటల్లోగా కొత్త అధికారులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక్కో పోస్టుకు ముగ్గురు ఐఏఎస్/ఐపీఎస్ అధికారుల పేర్లను ప్రతిపాదించాలని.. వారికి సంబంధించిన గత ఐదేళ్ల వార్షిక పనితీరు మదింపు నివేదిక (ఏపీఏఆర్)లు, విజిలెన్స్ క్లియరెన్స్‌లను సైతం జత చేయాలని ఆదేశించింది.
ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి ఎస్.బీ జోషి గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి లేఖ రాశారు. దీనితో బదిలీ అయిన వారు తక్షణమే ఆయా పోస్టులకు వెళ్లాలని సీఎస్ బుధవారం రాత్రి ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర పర్యటనకు వచ్చి కేంద్ర ఎన్నికల సంఘం బృందానికి వివిధ రాజకీయ పార్టీల నుంచి అందిన ఫిర్యాదులు, నిబంధనల అతిక్రమణ, తమ దృష్టికి వచ్చిన ఇతర అంశాల ఆధారంగానే పెద్ద సంఖ్యలో అధికారులపై చర్యలు తీసుకున్నట్టు తెలిసింది.
పెద్ద ఎత్తున ఫిర్యాదుల నేపథ్యంలో చర్యలు
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్‌లతో కూడిన బృందం ఈనెల 3 నుంచి 5 వరకు రాష్ట్రంలో పర్యటించింది. ఎన్నికల సన్నద్ధతపై విస్తృతంగా సమీక్షలు, సమావేశాలు నిర్వహించింది. ఈ క్రమంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశమైంది.
ఈ సమయంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వ్యవహార శైలిపై ప్రతిపక్షాల ప్రతినిధులు ఈసీ బృందానికి పలు ఆధారాలతో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఎన్నికలకు ముందు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే అధికారులను జిల్లా కలెక్టర్లుగా, ఎస్పీలుగా బదిలీ చేశారని, నిష్పక్షపాతంగా వ్యవహరించే యువ అధికారులను పక్కనపెట్టారని పేర్కొన్నట్టు సమాచారం. దీనికితోడు ఈ అధికారులు క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకు ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలను బదిలీ చేసిన విషయం కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్లినట్టు తెలిసింది.
గతంలో ఎన్నికల నిర్వహణను ఎత్తిచూపుతూ..
కేంద్ర, రాష్ట్రాల ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాల ఉన్నతాధికారులు, డీజీపీ, సీఎస్, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో నిర్వహించిన సమావేశాల సందర్భంగా గతంలో నిర్వహించిన ఎన్నికల తీరుపై సీఈసీ బృందం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికలతోపాటు తర్వాత జరిగిన హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బు, మద్యం, బంగారం, ఇతర కానుకలు పంపిణీ చేసినట్టు ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నాయని గుర్తు చేసినట్టు తెలిసింది.
తెలంగాణతోపాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో ఓటర్లను అత్యధికంగా ప్రలోభాలకు గురిచేస్తున్నట్టు తమకు సమాచారం ఉందని స్పష్టం చేసినట్టు సమాచారం. ఇంత జరుగుతున్నా ఎన్నికల సమయంలో జప్తు చేస్తున్న డబ్బు, మద్యం, మాదకద్రవ్యాలు, బంగారం, వెండి, ఇతర కానుకలు నామమాత్రంగానే ఉన్నాయని పేర్కొన్నట్టు తెలిసింది. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికలు నిర్వహించిన తీరుపై పదేపదే ఆక్షేపణలు తెలిపినట్టు సమాచారం. మరోవైపు డ్రగ్స్, లిక్కర్ మాఫియాపై చర్యలు తీసుకోవడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
మహారాష్ట్ర, గుజరాత్‌లలో పెద్ద మొత్తంలో దొరికి డ్రగ్స్ రాష్ట్రం నుంచే తరలివెళ్లినట్టు నివేదికలు ఉన్నాయని.. డ్రగ్స్ మాఫియాతో చేతులు కలిపారా? అని వ్యాఖ్యానించినట్టు సమాచారం. రవాణా శాఖ కార్యదర్శి అధికార పార్టీ సభలకు వాహనాల కేటాయింపులో సహకరించినట్టు వచ్చిన ఆరోపణలతో ఆయనను తొలగించినట్టు తెలిసింది. వివిధ జిల్లాల్లో ఎస్పీలు ప్రతిపక్షాల సభలు, సమావేశాలకు అనుమతులు నిరాకరించడం, నిబంధనలను ఉల్లంఘించడం తదితర ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని వేటు వేసినట్టు సమాచారం.
మరో నాలుగు రాష్ట్రాల్లోనూ బదిలీలు..
తెలంగాణతోపాటు శాసనసభ సాధారణ ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో కూడా పెద్ద సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో వేటుపడిన వారిలో 9 మంది కలెక్టర్లతోపాటు పలువురు పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు ఉన్నారు.
అధికార వర్గాల్లో ప్రకంపనలు
రాష్ట్రంలో విస్తృతంగా సమీక్షలు జరిపి వెళ్లిన వారంలోనే కేంద్ర ఎన్నికల సంఘం 20 మంది అధికారులపై బదిలీ వేటు వేయడం అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బదిలీ చేసిన అధికారులను ఇంకా ఎలాంటి ఇతర పోస్టుల్లో ఇంకా నియమించలేదు. అయితే బదిలీ అయిన 10 మంది జిల్లా ఎస్పీల్లో 9 నాన్ కేడర్ ఎస్పీలే (ఐఏఎస్ కాకుండా ఎస్సై, సీఐ వంటి పోస్టుల నుంచి సీనియారిటీతో ఎస్పీగా నియామకమైనవారే) కావడం గమనార్హం. సాధారణంగా జిల్లా ఎన్నికల అధికారులుగా కలెక్టర్లే వ్యవహరిస్తారు. ఇలాంటిది నాలుగు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేయడం, వారికి ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని ఈసీ ఆదేశించడం గమనార్హం.
20 మంది ఐఏఎస్, ఐపీఎస్, నాన్ కేడర్ ఎస్పీలపై ఈసీ వేటు..
Published Thu, Oct 12 2023 1:19 AM | Last Updated on Thu, Oct 12 2023 11:21 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment