
సాక్షి, హైదరాబాద్ : కారుతో సహా వాగులో గల్లంతైన టీఆర్‌ఎస్ నేత జంగపల్లి శ్రీనివాస్ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో ఫోన్లో మాట్లాడిన మంత్రి.. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జంగపల్లి శ్రీనివాస్, నిన్న రాత్రి ముగ్గురు స్నేహితులతో కలిసి వాహనంలో వెళ్తుండగా.. సిద్దిపేట జిల్లా దర్గాపల్లి వద్ద వాహనంతో సహా వాగులో పడిపోయారు. స్థానికులు వెంటనే గమనించి ముగ్గురిని బయటకు తీయగా... కారుతో పాటు శ్రీనివాస్ గల్లంతయ్యాడు.
(చదవండి : మూసీలో చిక్కుకున్న యువకులు)
విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. సోమవారం ఉదయాన్నే సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో సిద్ధిపేట ఆర్డీవో ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు.