
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను వచ్చే నెల 7 నుంచి నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సోమవారం ప్రగతి భవన్‌లో ఈ అంశంపై పలువురు మంత్రులతో ఆయన చర్చించారు. రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైన అంశాలపై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నందున సెప్టెంబర్‌లో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. 20 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం వల్ల ముఖ్యమైన అంశాలపై సమగ్ర చర్చ జరిపే అవకాశముంటుందని సీఎం, మంత్రులు అభిప్రాయపడ్డారు. 15 రోజుల పనిదినాలైనా ఉండేలా చూడాలన్నారు. (వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష)
పలు బిల్లులు, తీర్మానాలు ప్రవేశపెట్టడంతో పాటు విధాన నిర్ణయాలకు సంబంధించిన ప్రకటనలు కూడా చేయాల్సి ఉంటుందని, అన్నివిధాలుగా సిద్ధం కావాలని మంత్రులు, అధికారులకు సీఎం సూచించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా, సభ్యులు భౌతిక దూరం పాటించేందుకు ఏర్పాట్లు చేయాలని శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహా చార్యులను సీఎం ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment