
సాక్షి, హైదరాబాద్: కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపై చర్యలను సర్కారు వేగవంతం చేసింది. సెప్టెంబర్ ఏడో తేదీ నుంచి మొదలయ్యే శాసనసభ సమావేశాల్లో దీనికి ఆమోదముద్ర వేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రెవెన్యూ చట్టాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ కాలం చెల్లినవాటికి మంగళం పాడాలని నిర్ణయించింది. నూతన చట్టంలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా, బలంగా ఉన్న చట్టాలు/ రూల్స్‌నే పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తోంది.
తలనొప్పిని వదిలించుకోవాలని..
అవినీతి, వివాదరహిత పాలన అందించడానికి రెవెన్యూ శాఖ పనితీరు తలనొప్పిగా మారిందని ప్రభుత్వం భావిస్తోంది. కొందరు అధికారుల అవినీతి, పనితీరు సర్కారుకు చెడ్డపేరు తెస్తోందనే భావనలో ప్రభుత్వం ఉంది. మ్యుటేషన్లు, పాస్ పుస్తకాల కోసం తహసీళ్ల చుట్టూ తిప్పించుకుంటున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇటీవల కీసర తహసీల్దార్ నాగరాజు ఏకంగా రూ.1.10 కోట్ల నగదుతో ఏసీబీ చిక్కడంతో అవాక్కయిన ప్రభుత్వం నయా రెవెన్యూ చట్టానికి వేగంగా పదునుపెడుతోంది. ఇబ్బడిముబ్బడిగా ఉన్న చట్టాల ఏకీకృతం.. కొత్త చట్టంలో పొందుపరచాల్సిన సంస్కరణలౖపై కలెక్టర్లు, న్యాయ నిపుణులతో సేకరించిన అభిప్రాయాలను క్రోడీకరిస్తోంది.
ఒకే గొడుగు కిందకు..
కాలం చెల్లిన చట్టాలకు చరమగీతం పాడటం, గజిబిజిగా ఉన్న చట్టాలను సులభతరం చేస్తూ కొత్తచట్టానికి తుదిరూపునిస్తోంది. టైటిల్ గ్యారంటీ చట్టం ఆలోచనను దాదాపుగా విరమించుకున్న సర్కారు రెవెన్యూ కోడ్‌ను అమలు చేసే అంశాన్నిమాత్రం పరిశీలిస్తోంది. గతంలో 1999లోనే ఈ కోడ్‌కు అసెంబ్లీ ఆమోద ముద్ర వేసినా కేంద్రం ఓకే చెప్పకుండా 44 ప్రశ్నలు సంధిస్తూ తిప్పిపంపింది. దీనికే కొన్ని మార్పులు, చేర్పులు చేసి తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ కోడ్–2020ను ప్రవేశపెడితే ఎలా ఉంటుందని రాష్ట్ర సర్కారు ఆలోచిస్తోంది. ఇబ్బడిముబ్బడిగా ఉన్న చట్టాల స్థానే ఈ కోడ్‌తో ఒకే చట్టం మనుగడలోకి రానుంది. అయితే, దీనికి కేంద్రం ఆమోదం తప్పనిసరి కావడంతో కాలయాపన జరిగే అవకాశమూ లేకపోలేదని అధికారవర్గాలు అంటున్నాయి. మరోవైపు భూ పరిపాలనకు మూలాధారంగా భావించే ల్యాండ్ రెవెన్యూ చట్టం–1907ను ప్రామాణికంగా తీసుకొని తెలంగాణ భూ నిర్వహణ చట్టం–2020 ప్రవేశపెట్టే అంశంపై ప్రభుత్వం కుస్తీ పడుతోంది. భూ పరిపాలనకు సంబంధించిన ప్రతి అంశాన్ని స్పృశించే ఈ పాత చట్టంస్ఫూర్తి దెబ్బతినకుండా కొత్త చట్టానికి తుదిరూపు ఇవ్వాలని భావిస్తోంది. ఇందులో 124 చట్టాలు/నియమాలకు బదులు రెవెన్యూచట్టం–1907, భూ ఆక్రమణ చట్టం, అసైన్‌మెంట్, రెవెన్యూ రికవరీ, ల్యాండ్ గ్రాబింగ్, సర్వే, సరిహద్దులు, రక్షిత కౌలుదారు తదితర చట్టాలతో ముసాయిదా రెవెన్యూ చట్టాన్ని రూపకల్పన చేస్తోంది.
అదే రోజు మ్యుటేషన్
కొత్త చట్టంలో తహసీల్దార్లు, ఆర్డీవోల అధికారాల కత్తెర, వీఆర్వోల విలీనం, హోదాల మార్పుపై కసరత్తు చేస్తున్న సర్కారు.. సబ్ రిజిస్ట్రార్లకు కీలక బాధ్యతలు అప్పగించనుందని ప్రచారం జరుగుతోంది. దీంట్లో భాగంగా భూముల రిజిస్ట్రేషన్ జరిగిన మరుక్షణమే మ్యుటేషన్, ఇన్‌స్టంట్ పాస్‌పుస్తకాన్ని జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ భూములపై వివాదాలు, ఇతరత్రా వ్యాజ్యాల పరిష్కారానికి జిల్లా స్థాయిలో అధీకృత అధికారి/ట్రిబ్యునల్‌ను నియమించే అవకాశముంది. ప్రస్తుతం ఉన్న కలెక్టర్, అదనపు కలెక్టర్(రెవెన్యూ)కు ప్రత్యామ్నాయంగా ఈయన రెవెన్యూ వివాదాలను పరిష్కరిస్తారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం రెవెన్యూ వ్యవస్థలో ఉన్న ఏడంచెల అధికార వ్యవస్థను కుదించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, జిల్లాస్థాయిలో ఏర్పాటు చేసే ట్రిబ్యునల్‌కు రిటైర్డ్ జడ్జీలను నియమించే అవకాశమున్నట్లు ప్రభుత్వవర్గాల్లో చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment