లోకల్ 15% , నాన్ లోకల్ 85%
సాగు లేకపోవడంతో చుక్కలు తాకుతున్న కూరగాయల ధరలు
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తగ్గిన దిగుబడి
వానలు జాడ లేక,అధిక ఉష్ణోగ్రతలతో దెబ్బ
సిటీ 85 శాతానికిపైగా దిగుమతులపైనే ఆధారపడిన స్థితి
ఇతర రాష్ట్రాల్లోనూ కూరగాయల సాగుపై ఎండల ఎఫెక్ట్
దీనితో అడ్డగోలుగా పెరిగిపోయిన ధరలు
రాష్ట్రంలో పండించే కూరగాయల దిగుబడి వచ్చేదాకా ఇంతే!
ఆగస్టు వరకు రేట్లు తగ్గే అవకాశం లేదంటున్న వ్యాపారులు
క్రాప్ మ్యాపింగ్, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటే ఈ సమస్యకు పరిష్కారమని వెల్లడి
టమాటా సెంచరీ దాటి పోయింది.. చిక్కుడు అయితే డబుల్ సెంచరీ దిశగా పరుగులు పెడుతోంది.. ఐదు రూపాయలకు దొరికే కొత్తిమీర, పుదీనా కట్ట ఇప్పుడు పది, పదిహేను రూపాయలు పెట్టినా రావడం లేదు.. అదీ, ఇదీ అని ఏదీ లేదు. అన్ని కూరగాయల ధరలూ అడ్డగోలుగా పెరిగిపోయాయి.
‘జేబులో డబ్బులు తీసుకెళ్లి సంచీలో కూరగాయలు తేవడం కాదు.. సంచీలో డబ్బులు తీసుకెళ్లి జేబులో కూరగాయలు పెట్టుకోవాల్సి వచ్చేట్టుంది’ అని సామాన్యుడు నిట్టూరుస్తున్న పరిస్థితి. సుమారు కోటిన్నరకుపైగా జనాభా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ నగరం సమీపంలో కూరగాయల సాగు పెద్దగా లేకపోవడమే దీనికి కారణమని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. చాలా వరకు కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడంతో.. ఏమాత్రం కొరత వచి్చనా, రేట్లు చుక్కలను తాకుతున్నాయని అంటున్నాయి. – సాక్షి, హైదరాబాద్
క్రాప్ మ్యాపింగ్ అంటే..
కూరగాయలకు సంబంధించి క్రాప్ మ్యాపింగ్ చేస్తే అనేక లాభాలు ఉంటాయని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా ఎంచుకున్న ప్రాంతాల్లో పెరిగే కూరగాయల రకాలు, సాగు చేసే భూపరిమాణం, ఏ సమయంలో ఏ పంట వేయాలని నిర్దేశించడమే క్రాప్ మ్యాపింగ్. రైతులకు దీనిపై అవగాహన కల్పించి, అవే పంటలు వేసేలా చూస్తే లాభసాటిగా ఉండటమే కాకుండా కూరగాయల కొరతను అధిగమించ వచ్చని వివరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూరగాయలకు సంబంధించి ఎలాంటి క్రాప్ మ్యాపింగ్ జరగడం లేదని పేర్కొంటున్నారు.
ఒక్కసారిగా రేట్ల పరుగులు
ఇటీవలి వరకు కూరగాయల ధరలు కాస్త అటూఇటూగా అయినా అందుబాటులోనే ఉన్నాయి. కానీ వారం, పది రోజుల కింద ఒక్కసారిగా ధరలు పెరగడం మొదలైంది. ఇప్పుడు ఏకంగా కిలో రూ.100 దాటిపోయాయి. ఏటా ఎండాకాలం సీజన్‌లో కూరగాయల సాగుపై ప్రభావం ఉంటుందని, కానీ ఈసారి ఉష్ణోగ్రతలు మరీ అధికంగా నమోదవడం, వానలు జాడ లేకపోవడంతో పరిస్థితి తీవ్రంగా మారిందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. హైదరాబాద్ చుట్టూ కూరగాయలు పండించే ప్రాంతాల్లో సాగు సరిగా జరగలేదని, దిగుబడులు కూడా తగ్గిపోయాయని అంటున్నాయి.
ఇతర రాష్ట్రాల్లోనూ ఈసారి ఎండల ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటంతో ధరలు అడ్డగోలుగా పెరిగాయని పేర్కొంటున్నాయి. ఇక ఎక్కువశాతం వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుండటం.. మన దగ్గర మిగతా సీజన్లలో పండిన కూరగాయలను నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజీలు లేకపోవడం సమస్యగా మారిందని అంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తే.. అటు రైతులకు ప్రయోజనం కలగడంతోపాటు ధరల నియంత్రణతో వినియోగదారులకూ లాభం ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ ఈ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంటున్నారు.
బోయిన్‌పల్లి ప్రతిరోజూ 25 వేల క్వింటాళ్లు
హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి మార్కెట్‌కు ప్రతిరోజూ 25 వేల క్వింటాళ్ల కూరగాయలు దిగుమతి అవుతాయి. అందులో 15 శాతం వరకే తెలంగాణ జిల్లాల నుంచి వస్తున్నాయి. మిగతా కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నవే. ఎక్కువగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి వస్తున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూ ఉన్న చేవెళ్ల, వికారాబాద్, మేడ్చల్, శామీర్‌పేట, ములుగు, గజ్వేల్, భువనగిరి, జహీరాబాద్, సిద్దిపేట, నిజామాబాద్ ప్రాంతాల్లో కూరగాయలు పండిస్తారు.
ఎండల ఎఫెక్ట్‌తో ఏటా ఏప్రిల్, మే నెలల్లో కూరగాయల ధరలు అధికంగా ఉంటాయి. తర్వాత తగ్గుతాయి. కానీ ఈసారి ధరలు తగ్గే పరిస్థితులు లేవని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం సాగు దశలో ఉన్న కూరగాయలు ఆగస్టు నాటికి చేతికి అందుతాయని, ధరలు నియంత్రణలోకి వస్తాయని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. అప్పటివరకు దిగుమతులు తప్పని పరిస్థితిలో ధరలు ఎక్కువగానే ఉంటాయని అంటున్నారు.
క్రాప్ మ్యాపింగ్ చేస్తే మేలు
కూరగాయలకు సంబంధించి క్రాప్ మ్యాపింగ్ చేస్తే అనేక లాభాలు ఉంటాయని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా ఎంచుకున్న ప్రాంతాల్లో పెరిగే కూరగాయల రకాలు, సాగు చేసే భూపరిమాణం, ఏ సమయంలో ఏ పంట వేయాలని నిర్దేశించడమే క్రాప్ మ్యాపింగ్. రైతులకు దీనిపై అవగాహన కల్పించి, అవే పంటలు వేసేలా చూస్తే లాభసాటిగా ఉండటమే కాకుండా కూరగాయల కొరతను అధిగమించ వచ్చని వివరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూరగాయలకు సంబంధించి ఎలాంటి క్రాప్ మ్యాపింగ్ జరగడం లేదని పేర్కొంటున్నారు.
దిగుబడులపైనే ఆధారం..
ఏటా ఏప్రిల్, మే, జూన్‌లో కూరగాయల కోసం ఎక్కువగా దిగుబడులపైనే ఆధారపడాల్సి వస్తోంది. రాష్ట్రంలోని జిల్లాల నుంచి చాలా తక్కువగా కూరగాయలు వస్తున్నాయి. అందుకే ఎక్కువ ధరలు ఉన్నాయి. ఆగస్టు నాటికి ధరలు తగ్గుముఖం పడతాయి. – ఎం.వెంకన్న, సెలెక్షన్ గ్రేడ్ సెక్రటరీ, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ, బోయిన్‌పల్లి
ఆకుకూరలు కూడా దొరకట్లేదు
ఇప్పుడు ఆకుకూరలు కూడా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండలు ఎక్కువగా ఉండటంతో పంటల దిగుబడి తగ్గింది. అందుకే వేరే రాష్ట్రాల నుంచి తెప్పించుకోవాల్సి వస్తోంది. హోల్‌సేల్‌లో కొత్తిమీర పెద్దకట్ట రూ.30, పుదీనా రూ.15కుపైగా పలుకుతున్నాయి. – ఆనంద్‌కుమార్, ఆకుకూరల వ్యాపారి, గుడిమల్కాపూర్
Comments
Please login to add a commentAdd a comment