సాక్షి, సిటీబ్యూరో: కొత్త సంవత్సరం వచ్చేసింది. నయా జోష్ తెచ్చింది. ఉత్సాహాన్ని ఉరకలెత్తించింది. కానీ.. ఆ ఉత్సాహాన్ని చెక్కుచెదరకుండా కొనసాగించాలంటే ఆశావహ దృక్పథంతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాలి. సాధారణంగా ప్రతి ఒక్కరూ ఏటా ఏవో కొన్ని కార్యక్రమాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. కానీ.. ఆచరణలో మాత్రం విఫలమవుతారు. అలా విలువైన కాలాన్ని కోల్పోయి మరో ఏడాది గడిచిపోయిందని నిరుత్సాహానికి గురి కాకుండా.. తమ ఆశయాలు, ఆకాంక్షలు, అభిరుచులు, లక్ష్యాలకు అనుగుణంగా జీవనశైలిలోనే మార్పులను తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. గతకాలపు సమీక్షల్లోనే గడిపేయకుండా ముందడుగు వేస్తే అద్భుతాలు సాధించవచ్చు. జీవితాన్ని ప్రతి నిత్యం వేడుక చేసుకోవచ్చు.
రీల్ లైఫ్ కాదు.. రియల్ లైఫ్ కావాలి..
మొబైల్ మాయాజాలం.. కోరలు సాచి విస్తరించిన సామాజిక మాధ్యమాల వెల్లువ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. యువత ఈ మాయాజాలంలో కొట్టుకుపోతోంది. రీల్ జీవితానికి, రియల్ జీవితానికి తేడాను గుర్తించడం లేదు. ఇప్పుడు ఇదే అతిపెద్ద ముప్పుగా పరిణమించింది. కుటుంబం నుంచి సమాజం నుంచి డిటాచ్ అవుతున్నారు. రీల్ జీవితమే రియల్ జీవితంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదం నుంచి బయటపడాలి. కొత్త సంవత్సరం సందర్భంగా వ్యక్తిత్వం, కెరీర్, రిలేషన్స్, ఆర్థిక క్రమశిక్షణపై చక్కటి అవగాహన కలిగి ఉంటే అద్భుతమైన విజయాలను నమోదు చేయవచ్చు.
ఇలా ఉందాం..
⇒ వ్యక్తిత్వం అంటే నడవడిక మాత్రమే కాదు. ఆరోగ్యం. చక్కటి దేహదారుఢ్యం కూడా. ఆరోగ్యం పట్ల శ్రద్ధ, ఫిట్‌నెస్ విషయంలో అలసత్వం లేకుండా కొత్త సంవత్సరాన్ని ఆరంభించాలి.
⇒ చాలామంది చదువు విషయంలో నిర్లక్ష్యం చేస్తూ చివరి నిమిషంలో అంతా ఒకేసారి చదివేయాలని ప్రయతి్నస్తారు. దాంతో తీవ్రమైన ఒత్తిడికి గురై చదువులో వెనకబడిపోతారు. ‘టైమ్ కుదిరినప్పుడు’ చదువుకోవడం అనే పద్ధతి కాకుండా ‘టైమ్ కేటాయించి’ చదువుకోవడం మంచిది. దైనందిన జీవితంలో ఎంటర్‌టైన్‌మెంట్‌కు కూడా తప్పనిసరిగా కొంత సమయం
ఉండాల్సిందే.
అనుబంధాలను పెనవేసుకుందాం..
మొబైల్ ఫోన్, సోషల్ మీడియా వ్యసనంతో తల్లిదండ్రులకు, తోబుట్టువులకు దూరమైపోతున్నారు. స్నేహితులు, ఇరుగుపొరుగు పరిచయాలు కూడా ఉండడం లేదు. ఒంటరితనం అతి పెద్ద ప్రమాదంగా ముంచుకొస్తోంది. దీని నుంచి బయటపడేందుకు ఈ కొత్త సంవత్సరం ప్రారంభం నుంచే కుటుంబానికి, స్నేహితులకు, మన చుట్టూ ఉన్నవాళ్లకు తప్పనిసరిగా సమయం కేటాయించి వాళ్లతో గడిపేందుకు, సంభాషించేందుకు గట్టి నిర్ణయం తీసుకోవాలి.
సామాజిక సేవ కూడా ముఖ్యమే..
నూరు శాతం మార్కులు, సింగిల్ డిజిట్ ర్యాంకుల పోటీలో కొట్టుకొనిపోవడం వల్ల చాలామంది సామాజిక జీవితానికి దూరమవుతున్నారు. జీవితంలో చదువు ఎంతో ముఖ్యమైనది. సమాజం కూడా ముఖ్యమైందే. అందుకోసం కొంత సమయాన్ని తప్పనిసరిగా సామాజికసే వకు వినియోగించాలి.
ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం..
ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ గేమ్‌లు, బెట్టింగ్‌లు యువతను పట్టి పీడిస్తున్నాయి. ఈ ఆటలు రూ.వందలు, వేలల్లో మొదలై రూ.లక్షల్లోకి చేరుతున్నాయి. డ్రగ్స్ కంటే ప్రమాదకరంగా మారిన ఈ జూదం ఆడేందుకు చాలామంది మైక్రో ఫైనాన్స్ అప్పులు చేసి చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జీవితంలో ఆర్థిక క్రమశిక్షణ, డబ్బు అవసరాల పట్ల అవగాహన లేకపోతే చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ క్రమశిక్షణ కొత్త సంవత్సరం ప్రారంభం నుంచే మొదలవ్వాలని నిపుణులు చెబుతున్నారు.
ఏకాకులు కావద్దు..
వాట్సప్, ఫేస్‌బుక్‌లలో చురుగ్గా ఉండేవాళ్లు నిజ జీవితంలో ఏకాకులుగా ఉంటున్నారు. ఎవరితోనూ ఎలాంటి పరిచయం, ప్రేమ, బంధం, అనుబంధం లేకుండా మిగిలిపోతున్నారు. డిప్రెషన్‌కు గురవుతున్నారు. మొబైల్‌తో డిటాచ్ కావాలి. మనుషులతో అటాచ్‌మెంట్ పెంచుకోవాలి. జీవితం పట్ల ప్రగతిశీల దృక్పథాన్ని పెంచుకోవాలి.
– డాక్టర్ సి.వీరేందర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
గోల్స్ కాదు..
లైఫ్‌స్టైల్‌లో మార్పు రావాలి
కొత్త సంవత్సరం అనగానే ఏవో పెద్ద గోల్స్ పెట్టుకొని వాటిని సాధించలేక నిరాశా నిస్పృహలకు గురికావడం కంటే మనం ఇప్పుడు ఎలా ఉన్నాం. భవిష్యత్తులో ఎలా ఉండాలని కోరుకుంటున్నామనే విషయం పట్ల స్పష్టమైన అవగాహనతో అన్ని అంశాల్లో జీవన శైలిలోనే మార్పులు అలవర్చుకుంటే చాలు. ఏదో సాధించాలనుకొని, ఏదీ సాధించలేక గిల్టీగా ఫీల్ కావడం మంచిది కాదు.
– చల్లా గీత, మానసిక నిపుణురాలు
Comments
Please login to add a commentAdd a comment