సాక్షి హైదరాబాద్: గ్రేటర్ నగరంలో వాహనాల సాఫీ ప్రయాణానికి ఫ్లైఓవర్లు, లింక్‌రోడ్లు వంటివి నిర్మిస్తున్నప్పటికీ పార్కింగ్ సదుపాయాలను మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా వాణిజ్య ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య నివారణ కోసం వాణిజ్య ప్రాంతాల్లో మల్టీలెవల్ పార్కింగ్ సదుపాయాలు కల్పిస్తామని ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ ఏళ్ల తరబడి చెబుతున్నప్పటికీ, ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. నగరంలో దాదాపు వంద ప్రాంతాల్లో మల్టీలెవెల్ పార్కింగ్ ఏర్పాట్లు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పటికీ, ఒక్కచోట కూడా అందుబాటులోకి రాలేదు.
నాలుగేళ్ల క్రితమే..
- దాదాపు నాలుగేళ్ల క్రితం ప్రైవేట్ స్థలాల్లో పార్కింగ్ లాట్ల ఏర్పాటుకు ముందుకొచ్చేవారిని ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ వెలువరించారు. అయినా స్పందన లేకపోవడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. అనంతరం.. రెండేళ్ల క్రితం వాణిజ్య స్థలాల్లో మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాట్లు చేసే సాంకేతిక సామర్థ్యం కలిగిన వారికి.. ప్రైవేట్ స్థలాలున్న యజమానులకు మధ్య ఒప్పందం కుదిర్చే బాధ్యతను తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ భావించింది.
- ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నగరాల్లోని మల్టీ పార్కింగ్ విధానాలను సేకరించాలని, కువైట్‌కు చెందిన కేజీఎల్ ఏజెన్సీ నుండి మల్టీలెవల్ పార్కింగ్ నిబంధనలను తెప్పించుకోవాలని కమిషనర్ లోకేశ్‌కుమార్ అధికారులకు సూచించారు. పార్కింగ్ కోసం స్థలాలిచ్చేందుకు ముందుకొచ్చేవారి వివరాలను ప్రభుత్వానికి నివేదించి నియమ నిబంధనల అమలును జీహెచ్‌ఎంసీ మానిటరింగ్ చేయాలని భావించారు. కానీ ఇప్పటి వరకూ ముందడుగు పడలేదు.
మొబైల్ యాప్‌లో వివరాలు..
- మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాట్లు చేయడం ద్వారా పార్కింగ్ సదుపాయం తదితర వివరాలు వాహనదారులకు తెలిసేలా ప్రత్యేక యాప్‌ను రూపొందించాలనుకున్నారు. అంతేకాదు.. అవసరమైతే సదరు యాప్ నిర్వహణను గూగుల్ వంటి సంస్థలకు అప్పగించాలనుకున్నా రు. ఆలోచనలు బాగానే ఉన్నప్పటికీ, అమలుకు మాత్రం నోచుకోలేదు.
- మరోవైపు, పబ్లిక్ పార్కింగ్ కోసం ప్రభుత్వ శాఖలకు చెందిన ఇరవై స్థలాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాట్లకు హెచ్‌ఎంఆర్‌ఎల్‌కు బాధ్యతలప్పగించినా ఏర్పాటు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment