సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి సీజన్ పంటల సాగు జోరందుకుంది. వానాకాలంలో వర్షాలు పుష్కలంగా కురవడంతో చెరువులు, కుంటలు నిండుకుండలా కనిపిస్తున్నాయి. మరోవైపు భూగర్భ జలాలు సైతం పెరగడంతో సాగు పనులు చకచకా సాగుతున్నాయి. యాసంగి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 46,49,676 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
ఈ మేరకు క్షేత్రస్థాయిలో ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచింది. ఇప్పటివరకు 8,06,511 ఎకరాల్లో (17 శాతం) వివిధ పంటలు సాగయ్యాయి. గతేడాది ఇదే సమయంలో కేవలం 4,63,744 ఎకరాల్లో పంటలు సాగు కాగా, ఈ ఏడాది రెట్టింపు వేగంతో పంటల విస్తీర్ణం పెరుగుతున్నట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
జనవరి నాటికి లెక్కతేలనున్న వరి విస్తీర్ణం
ధాన్యం కొనుగోలుపై కేంద్రం పలు ఆంక్షలు విధించిన క్రమంలో యాసంగి సీజన్‌లో వరిసాగు వద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి సూచనలు చేస్తోంది. వాస్తవానికి యాసంగిలో రాష్ట్రంలో సగటున 52.80 లక్షల ఎకరాల్లో వరి పంట సాగయ్యేది.
ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయలేమని కేంద్రం తేల్చిచెప్పడంతో వరి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటలవైపు రైతుల దృష్టి పెట్టారు. ఈక్రమంలో ఈ ఏడాది వరిసాగును 21 లక్షల ఎకరాలకు తగ్గించేలా ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించింది. దీంతో ఈ సీజన్లో వరిసాగు 31.01 లక్షల ఎకరాల్లో ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
అయితే ఇప్పటివరకు 1,737 ఎకరాల్లోనే వరి సాగైనట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా వరినాట్లు డిసెంబర్‌లో మొదలై జనవరి రెండో వారంకల్లా గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. ప్రస్తుతం వరినాట్లు ప్రారంభ దశలో ఉండటంతో విస్తీర్ణం ఏమేరకు తగ్గుదల ఉంటుందో చూడాలి.
నాగర్‌కర్నూల్‌లో అత్యధికం...
యాసంగి సీజన్ పంటల సాగులో నాగర్‌కర్నూల్ జిల్లా ముందు వరుసలో ఉంది. ఈ జిల్లాలో ఇప్పటికే 76 శాతం మేర పంటలు సాగయ్యాయి. ఆ తర్వాత వికారాబాద్ జిల్లాలో 61 శాతం, వనపర్తి జిల్లాలో 39 శాతం, మహబూబ్‌నగర్ జిల్లాలో 36 శాతం, గద్వాల జిల్లాలో 35 శాతం పంటలు సాగైనట్లు తెలుస్తోంది.
ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఈ నెల రెండోవారం నుంచి సాగు పుంజుకునే అవకాశాలున్నాయి. నెలాఖరుకల్లా సాధారణ సాగు విస్తీర్ణాన్ని చేరుకునే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment