షరతులు విధించిన తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడి (ఏ5)గా సీబీఐ పేర్కొన్న డి.శివశంకర్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.2 లక్షల పూచీకత్తు సీబీఐ కోర్టుకు సమర్పించాలని, ప్రతి సోమవారం సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య హాజరు కావాలని, కేసులో ప్రత్యక్షంగా, పరోక్షంగా జోక్యం చేసుకోవద్దని, కోర్టులో విచారణ ముగిసే వరకు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించొద్దని ఆదేశించింది. అలాగే పాస్‌పోర్టు ట్రయల్ కోర్టుకు సమర్పించాలని, విచారణలో కోర్టుకు సహకరించాలని, ఎలాంటి క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడవద్దని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
వైఎస్ వివేకా హత్య కేసులో శివశంకర్‌రెడ్డిని సీబీఐ 2021లో అరెస్టు చేసింది. అప్పటి నుంచి జైలులో ఉంటున్న ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను గత సంవత్సరం సెప్టెంబర్ 19న సీబీఐ కోర్టు కొట్టివేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, సీబీఐ వద్ద ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండానే అరెస్టు చేసిందని, బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ జరిపి, సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు, సీబీఐ తరఫున స్పెషల్ పీపీ అనిల్ థన్వర్ వాదనలు వినిపించారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసినందున శివశంకర్‌రెడ్డి నేడు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
ఏళ్లుగా జైలులో ఉంచడం సరికాదు
నిందితులనే పేరుతో ఏళ్ల తరబడి జైలులో ఉంచడం సరికాదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పలు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశాయని తెలిపారు. నిందితుని తరపు న్యాయవాది వాదనలతో పాటు ఈ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేస్తున్నట్లు వివరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం నిందితులకు కూడా హక్కులు ఉంటాయని స్పష్టం చేశారు. నిందితుని తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘2021 అక్టోబర్ 26న సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రంలో శివశంకర్‌రెడ్డిపై ఎలాంటి ఆరోపణలు లేవు. హంతకుడు దస్తగిరి (ఏ4)ని అప్రూవర్‌గా పేర్కొన్నారు. అతను చెప్పిన స్టేట్‌మెంట్‌లో శివశంకర్‌రెడ్డిపై ఆరోపణలు చేశాడు.
2022 జనవరి 31న దాఖలు చేసిన తొలి మధ్యంతర అభియోగపత్రంలో శివశంకర్‌రెడ్డిని ఏ5గా చేర్చారు. కేసులో ఇరికించడానికే నిందితుడిగా చేర్చారు. దస్తగిరి చెప్పిన సెక్షన్ 161, 164 స్టేట్‌మెంట్లలో పరస్పర విరుద్ధ అంశాలున్నాయి. కేసు తీవ్రతను గుర్తించని ట్రయల్ కోర్టు కీలక నిందితుడు దస్తగిరికి ముందస్తు బెయిల్ ఇచ్చి విడుదల చేసింది. హత్య, సాక్ష్యాల చెరిపివేతలో శివశంకర్‌రెడ్డికి సంబంధం ఉన్నట్లు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవు. అయినా 2021 నవంబర్ 17 నుంచి జైలులో ఉంచడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. 55 ఏళ్ల శివశంకర్‌రెడ్డి వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. భుజానికి కూడా ఇటీవలే శస్త్రచికిత్స జరిగింది. నిరంతరం వైద్యుల పర్యవేక్షణ అవసరం. దీని మెడికల్ రిపోర్టును కూడా అందజేశాం’ అని కోర్టుకు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment