హాల్ టికెట్లు అందక పరీక్షకు దూరం
● కళాశాల ఎదుట తల్లిదండ్రులు, విద్యార్థుల ఆందోళన
తిరుపతి ఎడ్యుకేషన్ : హాల్‌టిక్కెట్లు అందక తొమ్మిది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు దూరమైన ఘటన తిరుపతి బైరాగిపట్టెడలో చోటు చేసుకుంది. వరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా, జీడీనెల్లూరు నియోజకవర్గం, పెనుమూరులో గత కొన్నేళ్లుగా ఎస్వీ జూనియర్ కళాశాల పేరుతో ప్రైవేటు జూనియర్ కళాశాలను నిర్వహించారు. అయితే 2024–25 విద్యాసంవత్సరంలో ఈ కళాశాలను తిరుపతి సమీపం రాయలచెరువుకు సంబంధించిన ఓం ప్రకాష్ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. అదే పేరుతో బైరాగిపట్టెడ వద్ద ఇంటర్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి అనుమతులు తీసుకోకుండా కళాశాలను ఏర్పాటుచేసి అడ్మిషన్లు చేపట్టాడు. అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో గతంలో ఆర్‌ఐఓ ఆ కళాశాలను సందర్శించి షోకాజు నోటీసులను అందించారు. దీంతో ఎస్వీ జూనియర్ కళాశాల అనే బోర్డును తీసేసి కోచింగ్ సెంటర్ అనే బోర్డును ఏర్పాటుచేసుకున్నాడు. కొన్నాళ్లకు ఓమ్ ఎస్‌వీవీ జూనియర్ కళాశాలగా బోర్డును ఏర్పాటు చేశాడు. దాదాపుగా 86 మంది మొదటి సంవత్సరం విద్యార్థులకు పెనుమూరు ఎస్వీ జూనియర్ కళాశాల పేరుతోనే పరీక్ష ఫీజులు కట్టారు. దీంతో ఈ విద్యార్థులందరూ చిత్తూరుకెళ్లి పరీక్షలు రాస్తున్నారు. అయితే వీరిలో 9 మంది విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కళాశాల ఎదుట మంగళవారం ఆందోళనకు దిగారు. పోలీసులు, ఆ కళాశాల యాజమాన్యం అక్కడికి చేరుకుని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. జూన్‌లో ప్రైవేటుగా పరీక్ష రాసే వెసులుబాటు ఉందని, దీనివల్ల విద్యార్థులకు ఎటువంటి విద్యాసంవత్సరం నష్టం ఏర్పడదని వారికి సర్దిచెప్పడంతో ఆందోళనను విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment