భూ బకాసురులు!
సాక్షి టాస్క్‌ఫోర్స్: తిరుపతికి సమీపంలో కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. గత టీడీపీ హయాంలో ఆక్రమణకు గురైన ఇదే భూమి కోసం ఇరువర్గాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన టీడీపీ కీలక నాయకుడు సహకారంతో ఈ భూమిని రాత్రికి రాత్రే ఆక్రమించేశారు. ముళ్ల చెట్లతో ఉన్న ప్రభుత్వ భూమిని రాత్రి సమయంలో జేసీబీలతో ఆఘమేఘాలపై చదునుచేసి మట్టితోలి చదును చేశారు. స్థానికుల కథనం మేరకు.. తిరుపతి రూరల్ మండలం, పేరూరు గ్రామ లెక్కదాఖలు సర్వే నంబర్ 529/4ఏలో సుమారు ఎకరం ప్రభుత్వ భూమి ఉంది. ప్రస్తుతం ఈ భూమి విలువ సుమారు రూ.20 కోట్లకుపైనే ఉంటుంది. గత టీడీపీ హయాంలో అప్పటి ఓ ఎంపీ ఆ భూమి తనదేనని అందులోకి ప్రవేశించారు. ఈ విషయం పలు వార్తా పత్రికల్లో ప్రచురితమైంది. ప్రభుత్వ భూమి విషయం తెలుసుకున్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ఎంపీని పిలిచి మందలించారు. అయితే ఆ ఎంపీ తన వద్ద ఉన్న పత్రాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అదేవిధంగా స్థానికంగా నివాసం ఉన్న ఓ వ్యక్తి కూడా ఈ భూమి తనదేనంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రెవెన్యూ అధికారులు సైతం ఈ భూమి ప్రభుత్వానిదేనని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మొత్తం భూ వివాదం న్యాయస్థానంలో నడుస్తుండగానే.. గురువారం రాత్రి పక్క పంచాయతీలో నివాసం ఉంటున్న స్థానిక కీలక టీడీపీ నాయకుడి సమీప బంధువు తన జేసీబీలతో శుభ్రం చేసి, తన టిప్పర్లతో మట్టి తోలి చదును చేశారు. రాత్రికి రాత్రే గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ ఆక్రమణల విషయం స్థానికులకు తెలియడంతో సర్పంచ్ ఆధ్వర్యంలో కబ్జాదారుడిని నిలదీశారు. ఈ భూమి తనదేనని, న్యాయస్థానంలో కూడా తనకు అనుకూలంగా తీర్పు వచ్చిందని చెప్పారు. తీర్పు కాపీని చూపించమని స్థానికులు నిలదీయడంతో అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఆ భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు.
రూ.20 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా!
అర్ధరాత్రి చదును చేసి మట్టి తోలిన అక్రమార్కులు
చంద్రగిరి టీడీపీ కీలక నాయకుడికి సమీప బంధువు దురాక్రమణ
అది ప్రభుత్వ భూమి
అది ప్రభుత్వ భూమి. ఆ భూమికి సంబంధించిన వ్యవహారం హైకోర్టులో నడుస్తోంది. అర్ధరాత్రి అక్రమణ జరిగినట్టు మా దృష్టికి వచ్చింది. వీఆర్వోను పంపించాం. ఆ భూమిలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేస్తాం.
– రామాంజులు నాయక్, తహసీల్దార్, తిరుపతి రూరల్
భూ బకాసురులు!
Comments
Please login to add a commentAdd a comment