
అంగన్‌వాడీల్లో అలజడి
బెదిరింపులకు దిగుతున్న నేతలు, అధికారులు
● విజయవాడలో రేపు మహా ధర్నా ● ధర్నాకు వెళితే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు ● ముందస్తు అరెస్ట్‌లకు సర్కార్ సిద్ధం
తిరుపతి అర్బన్: అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లలో అలజడి రేగింది. సమస్యలపై ఈనెల 10వ తేదీన విజయవాడలో జరిగే ధర్నాకు వెళ్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఒత్తిడి చేస్తున్నారు. ధర్నాకు వెళ్లకుండా ముందస్తుగానే ఇంటివద్దే అరెస్ట్‌లు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఓ వైపు ఉన్నతాధికారుల నుంచి.. మరోవైపు పోలీసుల నుంచి అంగన్‌వాడీలకు ఒత్తిడి తప్పడం లేదు. దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. అయితే తమ న్యాయమైన కోర్కెల సాధన కోసం ఽవిజయవాడ ధర్నాకు వెళ్లి తీరుతామని స్పష్టం చేస్తున్నారు.
ప్రతిపక్షంలో అలా....అధికారంలో ఇలా
ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబునాయుడు అంగన్‌వాడీలకు చెందిన అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. అంతేకాదు అప్పట్లో నారా లోకేష్ సమస్యలపై ధర్నాలు చేసుకుంటే తాము అడ్డురామని చెప్పిన విషయాలను అంగన్‌వాడీ కార్యకర్తలు గుర్తుచేస్తున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్నాకు వెళ్లకుండా బెదిరింపులకు పాల్పడడంపై పలువురు మండిపడుతున్నారు.
11 ప్రాజెక్టుల్లోనూ బెదిరింపులు
జిల్లాలో 11 అంగన్‌వాడీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టు అధికారుల నుంచి అంగన్‌వాడీ టీచర్లతోపాటు హెల్పర్లకు ఒత్తిడి తప్పడం లేదు. సాధారణంగా ప్రతి నెలా 25వ తేదీపైన సెక్టార్ మీటింగ్ నిర్వహిస్తుంటారు. అయితే విజయవాడలో రాష్ట్ర స్థాయి ధర్నాకు అంగన్‌వాడీలు పిలుపునివ్వడంతో మార్చి 10న సెక్టార్ మీటింగ్ ఉందంటూ ఆయా ప్రాజెక్టుల పరిధిలోని సీడీపీవోలు సమాచారం ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది.
10వ తేదీ సెక్టార్ మీటింగ్ అంట!
అంగన్‌వాడీ చరిత్రలో ఎప్పుడూ 10వ తేదీ సెక్టార్ మీటింగ్ నిర్వహించలేదు. ప్రతి నెలా 25వ తేదీ తర్వాతే నిర్వహించేవారు. విజయవాడలో 10వ తేదీ జరిగే ధర్నాకు వెళ్లకుండా అదే రోజు సెక్టార్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. న్యాయమైన కోర్కెల కోసం పోరాటం చేస్తే తప్పేముంది.
–రాజేశ్వరి, అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి (సీఐటీయూ అనుబంధం)
బెదిరింపులకు దిగడం సరికాదు
న్యాయమైన కోర్కెల సాధన కోసం ప్రశాంతంగా ధర్నా చేస్తామని ముందే అధికారులకు తెలియజేశాం. అయితే ధర్నాకు వెళ్లడం నేరంగా భావింతి ఒత్తిడి చేయడం సరైన పద్ధతి కాదు. అంగన్‌వాడీలకు పని ఒత్తిడి పెరిగింది. వేతనం రూ.26వేలు చెల్లించాలి.– పద్మలీలా, అంగన్‌వాడీ
వర్కర్స్ జిల్లా అధ్యక్షురాలు(సీఐటీయూ)
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 10వ తేదీన సెక్టార్ మీటింగ్ నిర్వహించనున్నాం. ధర్నాకు సంబంధించి అంగన్‌వాడీ నేతలు మాకు వినతిపత్రాన్ని అందించారు. బెదిరింపులు, ఒత్తిళ్లు లేవు. – వంసతబాయి, ఐసీడీఎస్, పీడీ
జిల్లా సమాచారం
అంగన్‌వాడీ ప్రాజెక్టుల సంఖ్య 11
అంగన్‌వాడీ సెంటర్లు 2,492
అంగన్‌వాడీ మెయిన్ సెంటర్ల కార్యకర్తలు 2,092
అంగ్‌వాడీ మినీ సెంటర్ల కార్యకర్తలు 348
అంగన్‌వాడీ హెల్పర్లు 2,066
పోరాటం తప్పదు
అంగన్‌వాడీల న్యాయమైన కోర్కెల కోసం పోరాటం చేయాలని భావించాం. అందులో భాగంగా రాష్ట్ర స్థాయిలో ఈనెల 10వ తేదీన విజయవాడలో ధర్నా నిర్వహించనున్నాం. సెంటర్ల అద్దెలు, టీఏ, డీఏలు చెల్లించాలి. – సౌజన్య,
శ్రీకాళహస్తి ఐసీడీఎస్ ప్రాజెక్టు అధ్యక్షురాలు

అంగన్‌వాడీల్లో అలజడి

అంగన్‌వాడీల్లో అలజడి

అంగన్‌వాడీల్లో అలజడి

అంగన్‌వాడీల్లో అలజడి
Comments
Please login to add a commentAdd a comment