
ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే!
ఓటేరు చెరువు కోసం శ్రీకాళహస్తి టీడీపీ నేతల మధ్య వార్
● రూ.కోట్ల విలువచేసే చెరువును ఆక్రమించారని ఎమ్మెల్యే బొజ్జల ధ్వజం ● ఎమ్మెల్యేపై మండిపడిన మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ● తిరుపతి సమీపంలోని చెరువు చుట్టూ కూటమి నేతల రాజకీయం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న ఓటేరు చెరువు విషయమై కూటమి ప్రభుత్వంలోని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు మధ్య వర్గపోరు తారస్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు దుమ్మె త్తి పోసుకుంటున్నారు. చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి రూరల్ మండలం, అవిలాల గ్రామ సమీపంలో ఓటేరు చెరువు ఉంది. ఈ చెరువుపై వివాదం తలెత్తడంతో జలపరిరక్షణ సమితి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 36.34 ఎకరాల విస్తీర్ణం ఓటేరు చెరువుదేనని 2006లో ప్రభుత్వం నిర్థారించినట్లు, 2013 అక్టోబర్‌లో ఏపీ హైకోర్టు సదరు భూమిని ప్రభుత్వ చెరువుగా ఉత్తర్వులు ఇచ్చినట్లు జలపరిరక్షణ సమితి వారు చెబుతున్నారు. ఇదే చెరువుపై గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ వివాదం తలెత్తింది. ఆ తరువాత ఓటేరు చెరువులోకి ఎవ్వరూ అడుగుపెట్టలేదు. తాజాగా మూడు రోజుల క్రితం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు భారీ వాహనాలతో మట్టి తీసుకొచ్చి చెరువుని పూడ్చివేసే ప్రయత్నాలు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న స్థానికులు అడ్డుకున్నారు. సీపీఐ, సీపీఎం నేతలు ఆందోళనలకు దిగారు.
శ్రీకాళహస్తి కూటమి నేతల మధ్య వార్
ఓటేరు చెరువు ఆక్రమణకు గురవుతోందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి రెండు రోజుల క్రితం అసెంబ్లీలో ప్రస్తావించారు. దీనివెనుక శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు హస్తం ఉందని పరోక్షంగా ప్రస్తావించారు. దీనిపై మాజీ ఎమ్మె ల్యే స్పందించారు. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే బొజ్జలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పనిలో పనిగా.. అవిలాల సర్వే నం.376లో 12.45 ఎకరాలు ఓటేరు చెరువు అని, సర్వే నం.370లో 6.70 ఎకరాలు కాలువ ఉందని, సర్వే నం.377లో 17.18 ఎకరాలు రైతుల భూమి ఉందని చెప్పుకొచ్చారు. మాజీ ఎమ్మెల్యే విమర్శలపై శ్రీకాళహస్తి టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి ఎస్సీవీ నాయుడుపై విమర్శలు చేయడం ప్రారంభించారు.
ఆ చెరువుకి.. ఈ ఇద్దరికీ సంబంధం ఏంటి?
ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఇద్దరిదీ శ్రీకాళహస్తి సొంత నియోజకవర్గం. చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న ఓటేరు చెరువుకు వీరిద్దరికీ ఏమిటి సంబంధం అని జిల్లాలో చర్చ సాగుతోంది. ఓటేరు చెరువు అక్రమణల వెనుక ఎస్సీవీ నాయుడు ఉన్నారని పరోక్షంగా ప్రస్తావించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి.. చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన ముఖ్య టీడీపీ నేత హస్తం ఉందని సీపీఐ, సీపీఎం నేతలు ఆరోపిస్తున్నారు. ఎస్సీవీ నాయుడికి కూటమి ప్రభుత్వంలో ఎటువంటి ప్రయోజనం జరగకుండా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి అడ్డుపడుతున్నారని ఆయన వర్గీయులు అభిప్రాయపడుతున్నారు. ఎస్సీవీకి ప్రయోజనం చేకూరితే.. భవిష్యత్‌లో తనకు ఇబ్బందులు తప్పవని ఎమ్మెల్యే బొజ్జల లోచన చేస్తున్నట్టు ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా ఓటేరు చెరువు వివాదం శ్రీకాళహస్తి కూటమి నేతల మధ్య చిచ్చురేపింది.
Comments
Please login to add a commentAdd a comment