
టీటీడీ ప్రక్షాళన అంటే ఇదేనా?
● చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన భూమన
తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల్లో తిరుమల పవిత్రతను మంటగలిపేశారని టీటీడీ బోర్డు మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తిరు పతి పద్మావతిపురంలోని పార్టీ క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. టీటీడీని ప్రక్షాళన చేస్తా మని, శ్రీవారి వైభవాన్ని మరింత పెంచుతామని చంద్రబాబు ప్రగల్భాలు పలికారని ఆరోపించారు. అదన పు ఈఓ వెంకయ్యచౌదరి అధికారిలా కాకుండా చంద్రబాబు తొత్తులా వ్యవహరిస్తూ మంత్రి లోకేష్ పీఏ సాంబశివరావు సిఫార్సు చేసే లెటర్లతో వీఐపీ దర్శనా ల దందా సాగిస్తున్నారని మండిపడ్డారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కేవలం రోజుకు 4వేలు మాత్రమే వీఐపీ దర్శనాలు కల్పించి సామాన్య భక్తులకు పెద్దపీట వేశామని గుర్తుచేశారు. ఇప్పుడు సామాన్య భక్తులను గాలికి వదిలేసి వీఐపీల సేవలో టీటీడీ అధికారులు మునిగితేలుతున్నారని విమర్శించారు. తిరుమలను భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్రమైన శ్రీవారి లడ్డూలో ఆవు కొవ్వు కలిపారంటూ దుష్ప్రాచారం చేయడం, వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీలో ఆరుగురు మృతి చెందడం, శ్రీవారి ఆలయం ఎదుట బిర్యానీ, గుడ్లు తెచ్చుకుని తినడం, విచ్చలవిడిగా మద్యం, మత్తు పదార్థాలు గంజాయి వినియోగించడం, తిరుమలలో నాలుగుసార్లు ఎర్రచందనం పట్టుబడడం, పవిత్రమైన పాపనాశనం జలాల్లో బోటింగ్ పెట్టడం వంటి అనేక పాపాలకు చంద్రబాబే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదల గుండెల్లో జగనన్న
సంక్షేమ పథకాల ద్వారా రూ. 3లక్షల కోట్లు అందించి పేదల గుండెల్లో స్థిరంగా నిలిచిపోయిన నాయకుడు జగనన్న అని కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తర్వాత ఒక్క పేదవాడికీ మేలు చేయని ప్రజాద్రోహి చంద్రబాబు అని ఆరోపించారు. తిరుమల పవిత్రత మంటగలుస్తున్నా, పేదలకు సంక్షేమ పథకాలు అందక అలమటిస్తున్నా తనకేమీ పట్టనట్లుగా సనాతన ధర్మ పరిరక్షకుడు పవనానందస్వామి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కూటమి అరాచకపాలనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, త్వరలోనే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.