
జిల్లాలో ఇష్టారాజ్యంగా సైఖతం
● యంత్రాలతో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు ● టిప్పర్లతో సరిహద్దు దాటిస్తున్న కూటమి నేతలు ● ఇంటి నిర్మాణాల నిమిత్తం సామాన్యులు వెళితే కేసులు ● పచ్చమూక అక్రమార్జనకు అండగా అధికారులు
సాక్షి ప్రతినిధి, తిరుపతి : జిల్లాలో కూటమి నేతలకు ఉచిత ఇసుక ప్రకటన పెద్ద వరంగా మారింది. స్థానికుల పేరుచెప్పి విచ్చలవిడిగా ఇసుక తవ్వి అక్రమంగా తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. కళ్లముందే మొత్తం వ్యవహారం నడుస్తున్నా అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ప్రధానంగా జిల్లాలోని శ్రీకాళహస్తి, చంద్రగిరి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు నియోజక వర్గాల పరిధిలో ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపునకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. స్థానిక ఎమ్మెల్యేల పేరుచెప్పి అనుచరులు యథేచ్ఛగా ఇసుక తోడేస్తున్నారు. నదుల్లో ఇసుక తవ్వకాలు చేయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నా ఇసుకాసురులు లెక్కచేయడం లేదు.
అక్కడ ఇష్టారాజ్యం
● సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు నియోజక వర్గాల పరిధిలో టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా ఇసుక వ్యాపారం సాగిస్తున్నారు.
● సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం, పిచ్చాటూరు పరిధిలో అడవికొడియంబేడు, బైటకొడియంబేడు పరిధిలోని అరుణానదిలోని ఇసుకను భారీ యంత్రాలతో తవ్వి తమిళనాడుకు తరలించేస్తున్నారు.
● సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట మండలం అన్నమేడు, మర్లపల్లె, భీమవరంలో స్వర్ణముఖి నది నుంచి ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, తండ్రి పేరుచెప్పుకుని వారి బంధువులు, అనుచరులు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు.
● పెళ్లకూరు మండలం కలవకూరు, చావాలి గ్రామాల నుంచి పలువురు కూటమి నేతలు గుట్టుచప్పుడు కాకుండా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు.
● గూడూరు నియోజక వర్గం చిట్టమూరు మండలం రొయ్యల వాగు, గుణపాటిపాళెం వద్ద ప్రతి రోజూ ఇసుకను తోడి అక్రమంగా తరలించి సొమ్ముచేసుకుంటున్నారు.
● వెంకటగిరి నియోజకవర్గం కలువాయి మండలంలోని తెలుగురాయపురం, రాజుపాళెం నుంచి రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో ఇసుకను తోడేస్తున్నారు. బెంగళూరు, చైన్నెకి తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు, ప్రైవేటు భూముల్లో సైతం కూటమి నేతలు అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.
రేణిగుంట మండలంలో..
చంద్రగిరిలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న దృశ్యం(ఫైల్)
చంద్రగిరిలో తగ్గేదేలే..!
చంద్రగిరి, తిరుపతి రూరల్ మండలాల పరిధిలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు.
చంద్రగిరి మండలంలోని ఎం.కొత్తపల్లె, ఐతేపల్లె, నాగయ్యగారిపల్లె, రెడ్డివారిపల్లె, నరసింగాపురం, బుచ్చినాయుడుపల్లె, తొండవాడ, శానంబట్లలో స్వర్ణముఖి నది నుంచి ఇసుకను జేబీసీలతో తవ్వుతూ టిప్పర్లతో బయటి ప్రాంతాలకు తరలించేస్తున్నారు.
తిరుపతి రూరల్ మండలంలోని పైడిపల్లె, అడపారెడ్డిపల్లె, దుర్గసముద్రం, చిగురువాడ, కేసీపేట, తనపల్లె, తిరుచానూరు ప్రాంతాల్లో అక్రమార్కులు రెచ్చిపోతున్నా రు. నదిలో ఇసుక నిల్వలు కరిగిపోతుండడంతో సమీపంలోని రైతుల పొలాల్లో కూడా తవ్వేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి రోజూ వందల కొద్దీ ట్రాక్టర్లు, టిప్పర్లు వేగంగా రాకపోకలు సాగిస్తుండడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు సైతం భయపడుతున్నారు.
స్వర్ణమ్మకు గర్భశోకం!
శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని స్వర్ణముఖి నది పరీవాహకప్రాంతంలో ఇసుకను కూటమి నేతలు ఇష్టారాజ్యంగా తోడేస్తున్నారు.
తొట్టంబేడు మండలం పెన్నలపాడు, విరూపాక్షిపురం వద్ద స్వర్ణముఖి నదిలో ఇసుకను యథేచ్ఛగా తవ్వేస్తున్నారు.
శ్రీకాళహస్తి పట్టణంలోని ఎంజీఎం హోటల్ వెనుక, ఎన్టీఆర్ పార్కు లోపలి వైపు, ఆనకట్ట సమీపంలో పచ్చమూకకు అడ్డే లేకుండా పోయింది.
శ్రీకాళహస్తి మండలం టీఎంవీ కండ్రిగ, చుక్కలనిడిగల్లు, పుల్లారెడ్డి కండ్రిగ ప్రాంతాల్లో ఇసుకను అక్రమంగా తవ్వేసి, తరలించి సొమ్ముచేసుకుంటున్నారు.
ఏర్పేడు మండలం ముసలిపేడు, పాపానాయుడుపేట పరిధిలోని స్వర్ణముఖి నదిలోని ఇసుకను అక్రమంగా దోచుకుంటున్నారు.
రేణిగుంట మండలం గాజులమండ్యం, జీపాళ్యెం ప్రాంతాల్లో స్వర్ణముఖి పరివాహక ప్రాంతాల వద్ద ఎక్కడ పడితే అక్కడ ఇసుకను తోడేస్తున్నారు. ఇందులో ఎమ్మెల్యే ముఖ్యఅనుచరుల పాత్ర ఉందని ప్రచారం జరుగుతోంది. జీపాళెం వద్ద స్వర్ణముఖి నదిలో చెన్నంపల్లెకు చెందిన టీడీపీ కార్యకర్త ఒకరు ఎమ్మెల్యే పేరుచెప్పి అక్రమంగా తవ్వకాలు సాగిస్తున్నారు. ప్రతి రోజూ వంద ట్రాక్టర్ల ఇసుకను తోడి తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై దౌర్జన్యానికి దిగుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.