సత్యవేడు: మండలంలోని ఇరుగుళం, కొల్లడం, పెద్ద ఈటిపాకం(రాచపాళెం), రాళ్లకుప్పం గ్రామాల్లో బలవంతపు భూసేకరణ ఆపాలని ఆయా గ్రామాల రైతులు ఏకగ్రీవంగా తీర్మానించారు. సోమవారం ఆయా గ్రామాలకు చెందిన వంద మంది రైతులు కలసి ఇరుగుళంలో సమావేశమయ్యారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. శ్రీసిటీ ఏర్పాటు చేసిన తొలి దశలో ఏపీఐఐసీకి సేకరించిన భూములలో ఇంకా 40 శాతం భూమి ఖాళీగానే ఉందన్నారు.
ఆ భూమిని వదిలేసి మళ్లీ భూసేకరణ ఎందుకని ప్రశ్నించారు. నాలుగు గ్రామాల్లో ఒక్క సెంటు భూమి కూడా ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. ఈ మేరకు రైతులందరూ తీర్మానం చేసినట్టు వెల్లడించారు. మండల పరిధిలో ఏపీఐఐసీకి నాలుగు గ్రామాల్లో 2,583.99 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ జారీచేయగా.. ఇందులో రైతుల పట్టా భూమి 1,753.060, ప్రభుత్వ భూమి 830.239 ఎకరాలు ఉన్నట్లు సమాచారం.
పోలీస్ గ్రీవెన్స్‌కు 121 అర్జీలు
తిరుపతి క్రైం: తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 121 ఫిర్యాదులు అందినట్టు ఏఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. ఇందులో దొంగతనాలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.
12న తుంబురుతీర్థ ముక్కోటి
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి ఏడున్నర మైళ్ల దూరంలో వెలసి ఉన్న శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం ఈనెల 12న జరగనుంది. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే ఈ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భక్తులు భావిస్తారు. ఈ మేరకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.
టీటీడీకి రూ.30 లక్షల విరాళం
తిరుమల: బెంగళూరుకు చెందిన బీఎంకే నగేష్ అనే భక్తుడు సోమవారం ఎస్వీ సర్వ శ్రేయస్ ట్రస్టుకు రూ.30 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలో అదనపు ఈవో సీహెచ్.వెంకయ్య చౌదరికి టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్‌రెడ్డి చేతుల మీదుగా విరాళం డీడీని అందజేశారు.
మూడు యూనిట్లకు రూ.726 బిల్లు
సైదాపురం: సైదాపురంలోని 311233 4000551 సర్వీసు నంబర్ గల వినియోగదారుడికి మూడు యూనిట్లకు రూ.726 బిల్లు వచ్చింది. అందులో ఫిక్సిడ్ చార్జీ రూ.30, ఎలక్ట్రిసిటీ డ్యూటీ 0.18 పైసలు, ఎఫ్‌పీపీసీఏ (2022) రూ.360, ఎఫ్‌పీపీసీఏ (2023) రూ.232, ట్రూ ఆఫ్ చార్జీ రూ.45, సర్‌చార్జీ రూ.25 మొత్తం రూ.726 వచ్చింది. అయితే వాస్తవంగా 3 యూనిట్లకు గాను రూ.5.70 కట్టాల్సి ఉంది. దీంతో వినియోగదారుడు ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నాడు.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు ఖాళీగా ఉన్నాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 72,960 మంది స్వామివారిని దర్శించుకోగా 23,126 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.63 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.

బలవంతపు భూసేకరణ ఆపండి

బలవంతపు భూసేకరణ ఆపండి