
కలియుగదైవంతో ఆటలా?
● కూటమి అరాచకాలు శ్రుతి మించాయి ● గోవుల మృతిపై టీటీడీ చైర్మన్ అవహేళనగా మాట్లాడడం దురదృష్టకరం ● శ్రీకాళహస్తి పవిత్రతను అపహాస్యం చేయడం దుర్మార్గం ● శ్రీకాళహస్తి ప్రెస్‌క్లబ్‌ను ఎమ్మెల్యే సుధీర్ క్లబ్‌గా మార్చేశారు
తిరుపతి సిటీ: ప్రజలను మభ్యపెట్టి అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం అరాచకాలు శ్రుతి మించాయని, కలియుగ దైవంతో సైతం ఆటలాడుతున్నారని, ఇది ప్రమాదకరమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి, నగరి నియోజకవర్గ పరిశీలకులు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ చిందేపల్లి మధుసూదన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల గోశాలలో గోవుల మృతి శ్రీవారి భక్తులను కలచివేసిందన్నారు. గోశాలలోని గిర్ జాతి ఆవు గర్భంతో రైల్వే ట్రాక్‌పై పడి మరణించినా టీటీడీకి సంబంధం లేదంటూ అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సాక్షాత్తు ఈఓ 46 ఆవులు చనియాయని చెప్పినా, సీఎం చంద్రబాబు మాత్రం గోశాలలో మరణాలు లేవని చెప్పడం దారుణమన్నారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు మెదపకపోవడం ఎమిటని ప్రశ్నించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గోశాలలో ఆవుల మృతిపై అవహేళనగా మాట్లాడడం శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశాయన్నారు. టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్‌రెడ్డి కేంద్ర నాయకులకు, మంత్రులకు దర్శనాలు చేయించుకుని వెలుగుతున్నాడని ఎద్దేవా చేశారు.
శ్రీకాళహస్తిని అపవిత్రం చేస్తున్నారు
జనసేన పార్టీ శ్రీకాళహస్తి ఇన్‌చార్జి వినూత పవిత్ర పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి రోజా ఓ కల్యాణ మండపానికి విచ్చేసిన సందర్భంలో ఆమె చిత్ర పటానికి చెప్పుల దండ వేయడం దారుణమన్నారు. ఈ దుశ్చర్య సాక్షాత్తు స్వామివారి కల్యాణం జరిగే ప్రదేశంలో జరగడం క్షమించరాని నేరమన్నారు. అలాగే శ్రీకాళహస్తిలో వైఎస్సాఆర్‌సీపీ నాయకులు ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్ మీట్ పెట్టేందుకు సైతం అనుమతులివ్వకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి క్లబ్‌గా ప్రెస్‌క్లబ్‌ను మార్చేశారని ధ్వజమెత్తారు.