వికారాబాద్: పదేళ్ల క్రితం తల్లి చనిపోవడం.. తండ్రి తాగుడుకు బానిస కావడం.. పెళ్లయిన సోదరుడు విడిగా ఉండడం.. కుటుంబ గొడవల కారణంగా అన్నతో మాటలు లేకపోవడంతో.. తనకెవరూ లేరని మనోవేదనకు గురైన ఓ ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలంలో సోమవారం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాపూర్‌కు చెందిన మనోహర్(16) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం తన మొబైల్ వాట్సాప్‌లో ‘ఐ మిస్ యూ ఫ్రెండ్స్’ అని స్టేటస్ పెట్టాడు. ఇది చూసిన చిన్నాన్న కూమారుడు భాను ప్రసాద్.. మనోహర్‌కు ఫోన్ చేశాడు. స్పందించక పోవడంతో పొలం వద్దకు వెళ్లాడు. అప్పటికే మనోహర్ చెట్టుకు వేళాడుతూ విగతజీవిగా కనిపించాడు.
ఈ విషయాన్ని భానుప్రసాద్ మృతుడి సోదరుడు మల్లేశ్‌కు తెలియజేశాడు. మనోహర్ తన తండ్రి, స్నేహితులతోనే ఎక్కువగా సన్నిహితంగా ఉండేవాడని.. కొంతకాలంగా నాన్న మద్యానికి బానిస కావడం.. తనను సరిగ్గా చూసుకోకపోవడంతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని మల్లేశ్ పొలీసులకు తెలిపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పురుషోత్తం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment