
షాద్‌నగర్‌రూరల్: ప్రియుడితో గొడవపడిన మహిళ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని అయ్యవారిపల్లి శివారులో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ దేవకి తెలిపిన ప్రకారం.. కొందుర్గు మండలం ఆగిర్యాలకు చెందిన గుమ్మడి నిర్మలమ్మ(36), ఎల్లయ్య దంపతులకు ఒక బాలిక సంతానం. నిర్మలమ్మ కొన్నేళ్లుగా భర్తకు దూరంగా ఉంటోంది.
ఈ క్రమంలో తొమ్మిదేళ్లుగా తలకొండపల్లికి చెందిన రవీందర్‌తో సహజీవనం చేస్తోంది. రవీందర్ ఈ నెల 24న అయ్యవారిపల్లిలోని స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో నిర్మలమ్మ రవీందర్‌కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకుంది. మంగళవారం ఉదయం అయ్యవారిపల్లికి వెళ్లి రవీందర్‌తో గొడవపడింది. నన్ను పట్టించుకోవడం లేదు.. నేను చనిపోతాను అంటూ గ్రామ సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో దూకింది.
గమనించిన స్థానికులు ఆమెను కాపాడేందుకు యత్నించినా వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న పట్టణ సీఐ ప్రతాప్‌లింగం, ఎస్‌ఐ దేవకి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. బాధితురాలి తల్లి సుగుణమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ దేవకి తెలిపారు.