వికారాబాద్: వెనుక నుంచి వేగంగా వచ్చిన సిమెంట్ ట్యాంకర్.. బైక్‌ను ఢీకొట్టడంతో ఓ బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన శనివారం మొయినాబాద్ సమీపంలోని రాధాస్వామి సత్సంగ్ సమీపంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా కుల్కచర్లకు చెందిన కొత్తపల్లి విఘ్నేశ్‌చారి (19) తల్లి మరణించడంతో.. తండ్రి మరో వివాహం చేసుకున్నాడు.
దీంతో బాలుడు చేవెళ్ల మండలం దేవరంపల్లిలో అమ్మమ్మ సువర్ణ వద్ద ఉంటూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పదిహేను రోజుల క్రితం విఘ్నేశ్‌చారి నగరంలోని కార్వాన్‌లో ఉండే మామ వద్దకు వెళ్లాడు. అమ్మమ్మ మొయినాబాద్‌లోని భాస్కర ఆస్పత్రిలో కళ్ల వైద్యం చేయించుకునేందుకు వెళ్లిందని తెలియడంతో శనివారం ఆమెను పరామర్శించి రూ.2 వేలు ఇచ్చాడు.
అనంతరం మొయినాబాద్ సమీపంలోని రాధాస్వామి సత్సంఘ్ వద్ద రోడ్డు పక్కన ఆగి భోజనం చేశాడు. రూ.500 నోటు ఇవ్వడంతో హోటల్ నిర్వాహకులు చిల్లర లేవని చెప్పారు. దీంతో మొయినాబాద్‌కు వెళ్లి, చిల్లర తీసుకుని వెనుదిరిగాడు. ఈ సమయంలో గుర్తుతెలియని వ్యక్తికి లిఫ్ట్ ఇచ్చాడు. అతన్ని ఎక్కించుకుని వచ్చి హోటల్ వద్ద బైక్ మలుపుతుండగా వెనకనుంచి అతివేగంగా వచ్చిన సిమెంట్ ట్యాంకర్ ఢీకొట్టింది.
వెనక కూర్చున్న వ్యక్తి ఎరిగి రోడ్డు పక్కన పడగా.. విఘ్నేశ్‌చారి ట్యాంకర్ టైర్ల కింద పడ్డాడు. అతని నడుముపై నుంచి వెళ్లిన వాహనం కొద్దిదూరం ఈడ్చుకెళ్లింది. దీంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. రోడ్డు పక్కన ఎగిరిపడ్డ వ్యక్తి ప్రాణాలతో బయటపడి అక్కడి నుంచి పారిపోయాడు. ఇదిలా ఉండగా విఘ్నేశ్‌చారి తల్లి ఆరేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఆ తర్వాత రెండేళ్లకే అన్న మరణించాడు.
ఆస్పత్రిలో ఉన్న అమ్మమ్మను చూసేందుకు వచ్చిన విఘ్నేశ్‌ను ట్యాంకర్ బలితీసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment