
పునాదిపడని ‘ఇందిరమ్మ’
బషీరాబాద్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి గ్రహణం పట్టుకుంది. గత ఏడాది కోటా కింద మంజూరైన ఇళ్లకు నేటికీ పునాది రాయి పడలేదు. గృహ నిర్మాణ శాఖలో సిబ్బంది కొరత, పలు నిబంధనల కారణంగా ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు ముందుకు రావడంలేదు. జిల్లాలోని 20 మండలాల్లో మొదటి దశ కింద 20 గ్రామాలను ఇందిరమ్మ ఇళ్ల పథకానికి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. 2,285 ఇళ్ల నిర్మాణాలకు కలెక్టర్ ఆమోదంతెలిపారు. ఇప్పటి వరకు పంచాయతీ రాజ్,గృహ నిర్మాణ శాఖ అధికారులు కలిసి జిల్లా వ్యాప్తంగా 214 ఇళ్లను ప్రాంభిస్తూ మార్కింగ్ వేశారు. మార్చి చివరి నాటికి కేవలం ఒక్క శాతం గృహాలకు మాత్రమే బేస్‌మెంట్ పనులు పూర్తయ్యాయి.
నిధులు తక్కువ.. నిబంధనలు ఎక్కువ
ఒక్కో ఇందిరమ్మ ఇంటి కోసం ప్రభుత్వం రూ.5 లక్షలు ఇవ్వనుంది. అయితే నిబంధనలు కఠినంగా ఉన్నాయి. అయితే 400 నుంచి 500ల చదరపు అగుడల విస్తీర్ణంలో ఇల్లు కట్టాలని షరతు పెట్టారు. మూడు గదులతో సీసీ స్లాబ్ వేయాలి. బిల్లుల చెల్లింపు కూడా నాలుగు దశల్లో ఉంటుంది. ఈ నిబంధనలు కారణంగా లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోవడడానికి ఆసక్తి చూపడం లేదు.
కేవలం 30 ఇళ్లే ప్రారంభం
ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్లకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున అర్జీలు వచ్చాయి. ప్రభుత్వం నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేసింది. ఇలా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు 14వేల ఇళ్లు వచ్చాయి. మొదటి దశలో మండలానికి ఒక గ్రామాన్ని పైలెట్‌గా ఎంపిక చేశారు. ఇలా జిల్లాలోని 20 గ్రామాలకు 2,285 మంది లబ్ధిదారులకు అధికారులు ఇళ్లు మంజూరు పత్రాలు అందజేశారు. ఏప్రిల్ మొదటి వారం వరకు కేవలం 30 ఇళ్లు మాత్రమే ప్రారంభమయ్యాయి. బేస్‌మెంట్ పనులు పూర్తయినా ఇప్పటి వరకు బిల్లులు రాలేదు. మిగతా వారు డబ్బు లేక ఇళ్ల నిర్మాణం చేపట్టలేదని తెలిసింది.
ఉత్సవ విగ్రహాల్లా ఇందిరమ్మ కమిటీలు
ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు కోసం గ్రామా ల్లో ఇందిరమ్మ కమిటీలను నియమించింది. ఈ కమిటీల్లోని సభ్యులకు పారితోషకాలు కూడా ఇస్తా మని ప్రకటించింది. అయితే పథకాల ఎంపికలో వీరి పాత్ర నామమాత్రంగానే ఉంది. పథకాలన్నీ ఆన్‌లైన్ ద్వారా మంజూరు కావడంతో కమిటీ సభ్యులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇళ్ల మంజూరులో వీరి పాత్రలేదు. మార్కింగ్ కూడా పంచాయతీ కార్యదర్శులే చూస్తున్నారు. దీంతో కమిటీలు నిద్రావస్థలోకి వెళ్లాయి.
పాత గోడలు తొలగించడానికే
రూ.20 వేల ఖర్చు
కాశీంపూర్ గ్రామానికి చెందిన చెట్టుకింది అనుసూజ ఇళ్లులేని నిరుపేద మహిళ. ఈమెకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. గతంలో ఉన్న చిన్నపాటి పాత ఇల్లు కూలిపోయింది. ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టుకోవడానికి జేసీబీతో పాత గోడలు తొలగించింది. ఇందుకోసం రూ.20 వేల వరకు ఖర్చు చేసింది. బేస్‌మెంట్‌కే రూ.లక్షన్నర వరకు ఖర్చు అవుతోందని ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలతో ఏమాత్రం సరిపోదన్నారు.
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఇలా..
నియోజకవర్గం ఇళ్ల సంఖ్య
పరిగి 847
తాండూరు 674
కొడంగల్ 392
వికారాబాద్ 360
చేవెళ్ల (నవాబుపేట) 12
పైలెట్ గ్రామాల్లో పడకేసిన నిర్మాణాలు
20 గ్రామాలకు 2,285 ఇళ్లు మంజూరు ముగ్గులు వేసినాముందుకు కదలని వైనం సర్కారు నిధులు సరిపోక పనుల పాతర బేస్‌మెంట్ పూర్తయిన గృహాలు ఒక్కశాతమే జిల్లాలో గృహ నిర్మాణానికి గ్రహణం
డబ్బు లేక ప్రారంభించలేదు
ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినా కట్టుకోవడానికి చేతిలో చిల్లిగవ్వ లేదు. గతంలో ఇళ్లు కట్టిన వారికి బిల్లులు వస్తలేవని తెలిసింది. దీంతో భయమేస్తోంది. బేస్‌మెంట్‌కు ఇచ్చే రూ.లక్షను అడ్వాన్స్‌గా చెల్లిస్తే పనులను ప్రారంభిస్తాం. సర్కారు ఇచ్చే రూ.5 లక్షలు బండల ఇల్లుకు కూడా సరిపోవు.
– కుర్వ నర్సమ్మ, మల్కన్‌గిరి
బేస్‌మెంట్ బిల్లు రాలే
నా పేరిట ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. నెల రోజుల క్రితం ఇంటి నిర్మాణం కోసం అధికారులు ముగ్గు పోశారు. ప్రభుత్వం ఇచ్చే రూ.లక్షకు అదనంగా రూ.50వేలు ఖర్చు చేసి బేస్‌మెంట్ పూర్తి చేశా. వారం రోజుల క్రితం పంచాయతీ కార్యదర్శి ఫొటో తీసుకెళ్లాడు. కానీ బిల్లు రాలేదు. దీంతో పనులు ఆపేశా. – అనురాధ, లబ్ధిదారు మల్కన్‌గిరి
ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించండి
పైలెట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అనుకున్నంతమేర జరగడం లేదు. మంచి ముహూర్తాలు లేవని ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించడం లేదు. ఇల్లు కట్టుకున్న వారికి నాలుగు దశల్లో రూ.5 లక్షలు చెల్లిస్తాం. ఇందిరమ్మ కమిటీలు ముందుండి పనులు ప్రారంభమయ్యేలా చూడాలి. ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి సకాలంలో బిల్లులు చెల్లిస్తాం. నిబంధనల మేరకు మూడు గదులతో ఇంటి నిర్మాణం చేపట్టాలి. లేకపోతే బిల్లులు ఆగిపోయే ప్రమాదం ఉంది.
– కృష్ణయ్య, పీడీ, గృహనిర్మాణ శాఖ

పునాదిపడని ‘ఇందిరమ్మ’

పునాదిపడని ‘ఇందిరమ్మ’