
సాక్షి, విశాఖపట్నం/జగదాంబ: నిస్వార్థంగా సేవలందిస్తున్న వలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ 35వ వార్డు పూర్ణామార్కెట్ జంక్షన్‌లో బుధవారం నిర్వహించిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తతకు దారితీసింది. పవన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న సమయంలో జనసైనికుల పేరుతో కొందరు యువకులు అక్కడికి చేరుకున్నారు. ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న ప్రదర్శనలో అల్లకల్లోలం సృష్టించారు. పవన్ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న వలంటీర్లను అడ్డుకునేందుకు వీధిరౌడీల్లా ఎగబడ్డారు.
వలంటీర్లు, మహిళలు, సాధారణ ప్రజలు, పోలీసులు అని చూడకుండా.. ఎవరు ఎదురుగా ఉంటే వారిపై తిరగబడ్డారు. చివరికి మహిళా పోలీసుల పట్లా దురుసుగా ప్రవర్తించారు. పోలీసులు సంయమనం పాటించి వారిని నిలువరిస్తున్నా.. మద్యం మత్తులో జోగుతున్న జనసైనికులు వారిపై పాలు చల్లారు. మంటలంటుకొని ఉన్న పవన్ దిష్టిబొమ్మని మహిళా వలంటీర్లపైకి విసిరారు. దీంతో ఆ మంటల నుంచి తప్పించుకునేందుకు వలంటీర్లు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పరుగులు పెట్టారు. దిష్టిబొమ్మ ముక్కలు పడిపోవడంతో కండిపిల్లి వరలక్ష్మి చీరకు నిప్పంటుకుంది.
స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటల్ని అదుపు చేయడంతో ప్రమాదం నుంచి బయటపడింది. దాడికి పాల్పడ్డ 14 మంది జనసైనికులను టూ టౌన్‌పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీవీఎంసీ 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు ఆధ్యర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 35వ వార్డు వలంటీర్లు, దుర్గాలమ్మ దేవస్థానం చైర్మన్ నాయిని మల్లిబాబు, మంగరాజు, కండిపల్లి వరలక్ష్మి, రమణమ్మ, నీలకంఠం, గౌరిశంకర్ పాల్గొన్నారు.