ఉదయ్ కుమార్ (ఫైల్)
విశాఖపట్నం: కారు ఢీకొని ఓ ఐటీ ఉద్యోగి దుర్మరణం చెందాడు. రెండు మూడు రోజుల్లో మృతుని భార్య ప్రసవించనుండగా ఈ దుర్ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రక్తం పంచుకుని పుట్టబోయే బిడ్డను చూడకుండానే ఈ లోకాన్ని వీడిపోయాడని గుండెలవిసేలా రోదిస్తున్నారు. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిఽధిలో ఆదివారం చోటుచేసుకున్న ప్రమాదానికి సంబంధించి స్థానిక సీఐ వై.రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అడవివరం వెంకటాద్రినగర్‌కు చెందిన బోడ సూరిబాబు, భార్య నిర్మలకు వివాహితులైన ఇద్దరు కుమారులు సందీప్, ఉదయ్ కుమార్ సంతానం.
ప్రస్తుతం వీరంతా కలిసి నివసిస్తున్నారు. సింహాద్రి అప్పన్న కొండపై ప్లాస్టిక్ బొమ్మలు దుకాణం నడుపుతూ కుమారులు ఇద్దరినీ చదివించడంతో వారు ప్రయోజకులై ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. చిన్న కుమారుడు ఉదయ్ కుమార్ (32) బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నాళ్లుగా వర్క్ హోమ్ నేపథ్యంలో ఇంటి వద్దనే ఉంటున్నాడు.
ఏడాది కిందటే అతనికి సరిహ అనే యువతితో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి. రెండుమూడు రోజుల్లో ప్రసవిస్తుందని వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో మధురవాడలోని మిత్రుడిని కలిసేందుకు మరో స్నేహితుడు జగన్‌ను తీసుకుని ద్విచక్ర వాహనంపై ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి ఉదయ్‌కుమార్ బయలుదేరాడు.
క్రికెట్ స్టేడియం ఎదురుగా ఉన్న జాతీయ రమదారిపై వెళ్తూ ఎంవీవీ సిటీ ముందు గల రోడ్డు మలుపు తిరుగుతుండగా వెనుక నుంచి వస్తున్న కారు బలంగా ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఉదయ్ కుమార్ అక్కడికక్కడే మరణించగా అతని స్నేహితుడు జగన్‌కు గాయాలుయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. క్షతగాత్రుని ఆస్పత్రికి తరలించారు. మృతుని సోదరుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారకుడైన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment