
గుదిబండగా మారిన ఇంటి నిర్మాణానికి చేసిన అప్పులు
ఈ విషయంలో ఇరువురి మధ్య మనస్పర్థలు
భర్త ఎస్‌బీసీలో ఉద్యోగి, భార్య ప్రైవేటు పాఠశాలలో టీచర్
అగనంపూడి: ఇంటి నిర్మాణానికి చేసిన అప్పులు గుదిబండగా మారాయి. ఇల్లు అమ్మి అప్పులు తీర్చేద్దామనే విషయంలో భార్యాభర్తల మధ్య ఏకాభిప్రాయం కుదరక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన దువ్వాడ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దువ్వాడ సీఐ వావిలపల్లి ఎర్రంనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. వడ్లపూడి నిర్వాసితకాలనీ యాతపాలెంకు చెందిన గెద్దాడ శ్రీనివాసరావు (40) షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ (ఎస్‌బీసీ)లో ఉద్యోగం చేస్తున్నాడు.
అతని భార్య దేవి (37) స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల శ్రీనివాసరావు ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం సుమారు రూ.40 లక్షల వరకు అప్పు చేశాడు. ఈ అప్పు భారంగా మారింది. ఇల్లు విక్రయించి అప్పులు తీర్చేద్దామని భర్త, తరువాత ఎలాగో చూద్దాం వద్దని భార్య గొడవ పడుతూ వస్తున్నారు. ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ఇద్దరూ కలిసి ఇంటి తలుపులకు గడియ పెట్టి ఫ్యాన్‌కు ఉరుపోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
పక్కింట్లో ఉంటున్న సోదరులు ఇంటి తలుపు తట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలోంచి చూసేసరికి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి సౌత్ ఏసీపీ టి.త్రినాథ్, సీఐ ఎర్రంనాయుడు చేరుకొని వివరాలు సేకరించారు. మృతులకు తొమ్మిదేళ్ల బాబు లోకేష్, ఏడేళ్ల పాప మహాలక్ష్మి ఉన్నారు. చిన్నారులను అనాథులను చేసి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవడంతో బంధువులు, పరిసర ప్రాంతీయులు కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం కోసం మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు.
అత్తారింటికి వెళ్లొచ్చి..
రాఖీ పండగ కోసం సోమవారం నగరంలో దొండపర్తిలో ఉంటున్న అత్తారింటికి పిల్లలతో కలిసి భార్యాభర్తలు వెళ్లారు. పాపకు జ్వరం కావడంతో పిల్లలిద్దరిని అక్కడే వదిలేసి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో యాతపాలెం వచ్చేశారు. సాయంత్రం వారి బాబు లోకేష్ తల్లిదండ్రులకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో వారి ఇంటికి దగ్గరిలో ఉంటున్న అతడి ఫ్రెండ్‌కు ఫోన్ చేసి వాళ్లమ్మకు ఫోన్ ఇమ్మని చెప్పాడు. ఆ బాబు ఇంటికి వెళ్లగా తలుపులు వేసి ఉండడంతో కిటికీలోంచి చూశాడు. ఫ్యాన్‌కు వేళాడుతున్న ఇద్దరిని చూసి పక్కింటిలో ఉన్నవారికి చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment