‘స్టీల్‌’ కాంట్రాక్ట్‌ కార్మికుల నెత్తిన పిడుగు | - | Sakshi
Sakshi News home page

‘స్టీల్‌’ కాంట్రాక్ట్‌ కార్మికుల నెత్తిన పిడుగు

Published Sat, Sep 28 2024 2:38 AM | Last Updated on Sat, Sep 28 2024 2:38 AM

‘స్టీ

‘స్టీల్‌’ కాంట్రాక్ట్‌ కార్మికుల నెత్తిన పిడుగు

సాక్షి, విశాఖపట్నం: తెలుగువారి ఆత్మగౌరవం ఉక్కు పరిశ్రమకు ఉరి తాళ్లు బిగుసుకుంటున్నాయి. స్టీల్‌ప్లాంట్‌ను దివాలా సంస్థగా చూపించి ప్రైవేటుకు అప్పగించే ప్రక్రియ జరిగిపోతోంది. మొన్న గోదావరి.. నిన్న అన్నపూర్ణ బ్లాస్ట్‌ ఫర్నేస్‌లు మూతపడ్డాయి. ఇప్పటికే మూలధనం సమస్య వెంటాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం ఒకేసారి 4,000 మంది కాంట్రాక్ట్‌ కార్మికుల తొలగింపు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా కార్మికుల ఆన్‌లైన్‌ పాసులను రద్దు చేసింది. యాజమాన్యం ఏకపక్షంగా తీసుకున్న ఈ చర్యపై కాంట్రాక్ట్‌ కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కార్మిక సంఘాలు ఆగ్రహం చెందాయి. దీనిపై యాజమాన్యంతో అటో ఇటో తేల్చుకునేందుకు కార్మికులు సిద్ధమవుతున్నారు.

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ లేదు.. ప్లాంట్‌ను కాపాడుతామంటూ కూటమి ప్రభుత్వం హామిలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి స్టీల్‌ప్లాంట్‌ను ఆదుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోయింది. ఇంతవరకు రూ.500 కోట్ల సాయం తప్ప మరేవిధమైన ప్రయోజనం దక్కలేదు. మరోవైపు ఒక్క ఫర్నేస్‌లో మా త్రమే నామమాత్రంగా ఉత్పత్తి చేస్తున్నారు. ఉద్యోగులను ఆర్థికంగా వేధిస్తున్నారు. సకాలంలో వేతనాలు చెల్లించడం లేదు. పొదుపు చర్యలంటూ క్వార్టర్లలో ఉన్న కార్మికుల కరెంట్‌ చార్జీలు పెంచారు. హెచ్‌ఆర్‌ఏ, ఎల్‌టీసీ, ఎల్‌ఏటీఏ, ఎల్‌ఎల్‌టీసీలు, కార్మికులకు బోనస్‌, అధికారులకు పీఆర్పీ నిలిపివేశారు. ఉద్యోగులను తగ్గించడంలో భాగంగా 500 మందిని నగర్‌నార్‌, సెయిల్‌ ప్లాంట్లకు డిప్యూటేషన్‌ చర్యలు ప్రారంభించారు. వీఆర్‌ఎస్‌ పేరిట 2,500 మంది ఉద్యోగులను పంపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు 30 శాతం తగ్గింపు పేరిట ఏకంగా 4000 మంది కాంట్రాక్ట్‌ కార్మికులను తొలగించడానికి చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా కార్మికుల గేటు పాసులను ఆన్‌లైన్‌లో రద్దు చేస్తున్నారు. రేపటి నుంచి మీకు పను లు లేవు, రావద్దు అంటూ సమాచారం ఇస్తున్నట్టు కార్మిక నాయకులు చెబుతున్నారు. ఈ విషయంలో కాంట్రాక్టర్లకు సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. కాంట్రాక్టర్ల వద్ద పనిచేసే కార్మికులను తొలగించాలనుకుంటే వారి ద్వారా సమాచారం ఇవ్వాల్సింది పోయి.. నేరుగా యాజమాన్యం తొలగించడం పట్ల అన్ని వర్గాలు విస్మయం చెందుతున్నాయి. కాగా.. యాజమాన్యం ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కాంట్రాక్ట్‌ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం సమయం ఇవ్వకుండా తమను తొలగిస్తే తమ కుటుంబాలు ఏమవ్వాలంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు. ఈ అంశంపై కార్మిక సంఘాల ప్రతినిధులు యాజమాన్యం వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మిక సంఘాలకు కనీసం చెప్పకుండా యాజమాన్యం నిర్ణయం తీసుకోవడాన్ని అంగీకరించబోమని స్పష్టం చేస్తున్నారు.

తొలగింపు చర్యలు ప్రారంభించిన యాజమాన్యం

4000 మంది ఆన్‌లైన్‌ పాసుల రద్దు

కార్మిక సంఘాల ఆగ్రహం

న్యాయ పోరాటం చేస్తాం

కాంట్రాక్ట్‌ కార్మికుల ఆకస్మిక తొలగింపు అప్రజాస్వామికం. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ముందస్తు సమాచారం లేకుండా ఇలా గేటు పాసులు రద్దు చేయడం దుర్మార్గం. ఏ ఒక్కరినీ తొలగించడాన్ని అంగీకరించబోము. అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధం. –జి.శ్రీనివాసరావు, అధ్యక్షుడు,

సీఐటీయూ కాంట్రాక్ట్‌ లేబర్‌ యూనియన్‌

కడుపు కొడుతున్నారు

ప్లాంట్‌ పరిరక్షిస్తామని చెప్పి కాంట్రాక్ట్‌ కార్మికులను తొలగించడం ద్వారా వారి కడుపు కొడుతున్నారు. పరిరక్షిస్తామంటే పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చర్యలు చేపట్టి అందుకు తగ్గట్టు ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ కార్మికులను నియమించాలి. ఇలా అర్ధాంతరంగా తొలగిస్తామంటే చూస్తూ ఊరుకోం. ఎంతవరకై నా వెళ్లి తొలగింపును అడ్డుకుంటాం. – మంత్రి రాజశేఖర్‌, గౌరవాధ్యక్షుడు,ఐఎన్‌టీయూసీ కాంట్రాక్ట్‌ కార్మిక సంఘం

తొలగింపు దుర్మార్గం

సెయిల్‌లో 19 మిలియన్‌ టన్నుల సామర్థ్యానికి లక్ష మంది కాంట్రాక్ట్‌ కార్మికులు పని చేస్తున్నారు. దాని బట్టి చూస్తే ఇక్కడ 7.3 మిలియన్‌ టన్నులకు కనీసం 30 వేల మంది ఉండాలి. అన్నింటికి సెయిల్‌ ప్రామాణికంగా ఉండే ఈ ప్లాంట్‌లో ఉన్న 14 వేల మంది నుంచి నాలుగు వేల మందిని ఎలా తొలగిస్తారు. ఇది దుర్మార్గపు చర్య.

– కె.ఎస్‌.ఎన్‌.రావు, అధ్యక్షుడు, స్టీల్‌ ఏఐటీయూసీ

No comments yet. Be the first to comment!
Add a comment
‘స్టీల్‌’ కాంట్రాక్ట్‌ కార్మికుల నెత్తిన పిడుగు 1
1/3

‘స్టీల్‌’ కాంట్రాక్ట్‌ కార్మికుల నెత్తిన పిడుగు

‘స్టీల్‌’ కాంట్రాక్ట్‌ కార్మికుల నెత్తిన పిడుగు 2
2/3

‘స్టీల్‌’ కాంట్రాక్ట్‌ కార్మికుల నెత్తిన పిడుగు

‘స్టీల్‌’ కాంట్రాక్ట్‌ కార్మికుల నెత్తిన పిడుగు 3
3/3

‘స్టీల్‌’ కాంట్రాక్ట్‌ కార్మికుల నెత్తిన పిడుగు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement