
కేజీహెచ్‌లో పిల్లల కోసం అత్యాధునిక వైద్యం
మహారాణిపేట: కేజీహెచ్‌లోని పీడియాట్రిక్ వార్డులో అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నూతన సౌకర్యాలు పిల్లల్లో వ్యాధులను క్షణాల్లో గుర్తించడంతో పాటు, మెరుగైన చికిత్సను అందించడానికి దోహదపడతాయని పిల్లల వార్డు విభాగాధిపతి డాక్టర్ చక్రవర్తి తెలిపారు. పాయింట్–ఆఫ్–కేర్ అల్ట్రాసౌండ్ (పీవోసీయూఎస్), 2డీ, ఈకో ప్రోబ్, న్యూరో సోనోగ్రఫీ వంటి అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ పరికరాల ఏర్పాటులో రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ బుజ్జిబాబు అందించిన సహకారం వెలకట్టలేనిదని డాక్టర్ చక్రవర్తి అన్నారు. డాక్టర్ బుజ్జిబాబు సత్వర స్పందన, సహాయ సహకారాలు, సాంకేతిక మార్గదర్శకత్వం ఎంతో విలువైనవని కొనియాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ ప్రయోజనాలు : నూతన పరికరాలు పలు పరీక్షలను వేగంగా నిర్వహించి, వ్యాధులను నిర్ధారించడంలో సహాయపడతాయి. తద్వారా అత్యవసర సమయాల్లో రోగులకు సత్వర చికిత్సను అందించవచ్చు. రక్తనాళాల స్థితిని అంచనా వేయడానికి, కష్టతరమైన ఇంట్రావీనస్ (ఐవీ) యాక్సెస్, ఇన్ఫీరియర్ వెనా కావా (ఐవీసీ) స్థితిని అంచనా వేయడానికి ఈ పరికరాలు ఉపయోగపడతాయి. గుండె సంబంధిత పరీక్షలు, హృదయ స్పందనల అంచనా, పెరికార్డియల్ ఎఫ్యూషన్, హీమోడైనమిక్ అస్థిరత్వాలను గుర్తించడానికి తక్షణ ఎకో కార్డియోగ్రఫీ సేవలు అందుబాటులో ఉంటాయి. నవజాత శిశువుల్లో మెదడు సంబంధిత వ్యాధులను గుర్తించడంలో న్యూరోసోనోగ్రఫీ పరికరం సహాయపడుతుంది. ఆకస్మిక కడుపు నొప్పి, అసిటీస్, కాలేయ సంబంధిత సమస్యలు, ప్రేగు వ్యాధులను బెడ్‌సైడ్ వద్దే పరీక్షించడానికి వీలుంటుందని డాక్టర్ చక్రవర్తి వివరించారు.
గేమ్ చేంజర్‌గా నూతన పరికరాలు
ఈ అత్యాధునిక పరికరాలు పీడియాట్రిక్ వార్డులో గేమ్ చేంజర్‌గా మారనున్నాయని డాక్టర్ చక్రవర్తి అభిప్రాయపడ్డారు. రేడియాలజీ విభాగంపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. అలాగే అత్యవసర పరిస్థితుల్లో రోగులను తరలించాల్సిన అవసరాన్ని కూడా తగ్గిస్తాయి. క్షణాల్లో వ్యాధి నిర్ధారణ జరగడం వల్ల, ప్రాణాపాయ స్థితిలో ఉన్న పిల్లలను కాపాడే అవకాశాలు మెరుగుపడతాయని ఆయన వెల్లడించారు.
నూతన పరికరాలతో మెరుగైన సేవలు
Comments
Please login to add a commentAdd a comment