
కుటుంబంలో మహిళ పాత్ర కీలకం
సీపీ సతీమణి సువశ్రీ బాగ్చి
మహారాణిపేట: కేజీహెచ్ ఆంకాలజీ విభాగంలో శనివారం మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర పోలీస్ కమిషనర్ సతీమణి సువశ్రీ బాగ్చి మాట్లాడుతూ ప్రతి ఇల్లు ఆనందమయంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మహిళ పాత్ర కీలకమని.. ఝాన్సీ లక్ష్మీబాయిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. మహిళలు క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉంటూ ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, విధిగా ఏడాదికి ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ మాట్లాడుతూ క్యాన్సర్‌కు సంబంధించిన అంశాలపై కేజీహెచ్‌లో ఉచిత వైద్య సేవలందించే దిశగా అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా క్యాన్సర్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులు, వారి పిల్లలను కలిశారు. పిల్లలకు అతిథులు బొమ్మలను బహుమతులుగా అందించారు. క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్న మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ కె.శిల్ప సేవలను ప్రశంసించారు. అనంతరం సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్ ముఖ్య అతిథి సువశ్రీ బాగ్చితోపాటు ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి, డాక్టర్ కె.శిల్పలను ఘనంగా సత్కరించారు. డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ జి.వాసవీలత, డీసీహెచ్‌ఎస్ ఆర్‌ఎంవో డాక్టర్ మెహర్ కుమార్, గ్రేడ్ వన్ నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి, ఆయా విభాగాలకు చెందిన నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment