● కొత్తగా చేరిన వారికి ఓటు హక్కు లేదు ● స్పష్టం చేసిన న
28నే బార్ అసోసియేషన్ ఎన్నికలు
విశాఖ లీగల్: విశాఖ న్యాయవాదుల సంఘం ఎన్నికలు ఈనెల 28న యథాతథంగా జరుగుతాయని ఎన్నికల అధికారి, సీనియర్ న్యాయవాది జి.ఎం.రెడ్డి వెల్లడించారు. ‘ప్రశ్నార్థకంగా న్యాయవాదుల సంఘం ఎన్నికలు’ శీర్షికతో ‘సాక్షి’ మంగళవారం ఓ వార్తను ప్రచురించింది. ఈ వార్తకు స్పందించిన జి.ఎం.రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల షెడ్యూల్‌లో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశారు. మరోవైపు కొత్తగా చేరిన న్యాయవాదులకు ఓటు హక్కు లేదని బార్ అసోసియేషన్ తెలిపింది. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఆదేశాల మేరకు 2,970 న్యాయవాదులు ఓటు హక్కు కలిగి ఉన్నారు. 28వ తేదీ ఉదయం 10 గంటలకు ఎన్నికల పోలింగ్ మొదలై సాయంత్రం 4.30కు పూర్తవుతుంది. అదే రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమై రాత్రి పది గంటలకు తుది ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. అభ్యర్థులందరూ తమ ప్రచారాన్ని కొనసాగించుకోవచ్చని, ఏమైనా సందేహాలు ఉంటే తనను నేరుగా సంప్రదించాలని జి.ఎం.రెడ్డి సూచించారు. కాగా.. ఎన్నికలపై స్పష్టత రావడంతో అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా అధ్యక్ష, కార్యదర్శి పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతీ న్యాయవాదిని వ్యక్తిగతంగా కలుస్తున్నారు. తమ అజెండాతో పాటు న్యాయవాదుల సంక్షేమానికి అందించే సేవల గురించి వివరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment