
అర్హత ఉన్నా.. అందని గృహజ్యోతి
వనపర్తిటౌన్: జిల్లాలో తెల్ల రేషన్‌కార్డు ఉండి, గృహజ్యోతి పథకానికి దూరంగా సుమారు 14 వేల మంది ఉన్నట్లు విద్యుత్‌శాఖ అధికారికంగా వెల్లడించింది. గతేడాది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారు సర్వీస్ నంబర్, ఆధార్ నంబర్‌లో తప్పులు దొర్లితే పుర కార్యాలయాలు, గ్రామాలు, మండల కేంద్రాల్లో ఉంటే ఎంపీడీఓ కార్యాలయాల్లో సవరించుకొని లబ్ధి పొందుతున్నారు. ప్రజాపాలన తర్వాత ఏడాది కాలంగా ప్రభుత్వం ఎలాంటి దరఖాస్తులు తీసుకోలేదు. ఫలితంగా జిల్లాలో 13,658 వేల మంది రాయితీ పొందడం లేదు. గృహజ్యోతికి అర్హత ఉండి బిల్లు చెల్లించని వారి వద్ద రూ.1.75 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఆర్థిక సంవత్సరం ముగింపునకు వారమే గడువు ఉండటంతో బకాయిలు ఎలా వసూలు చేయాలో ఆ శాఖ అధికారులకు అంతుపట్టడం లేదు. క్షేత్రస్థాయి సిబ్బంది బిల్లు వసూళ్లకు వెళ్లగా 200 యూనిట్లలోపే విద్యుత్ వినియోగిస్తున్నామని.. బిల్లు చెల్లించమని తెగేసి చెబుతుండటంతో ఎలా రాబట్టుకోవాలో తెలియక తర్జనభర్జన పడుతున్నారు. బకాయిదారుల్లో అత్యధికంగా జిల్లాకేంద్రంలో 2,766, వనపర్తి రూరల్‌లో 1,511, పెబ్బేరులో 1,505, కొత్తకోటలో 1,305, ఆత్మకూర్‌లో 1,065 మంది ఉన్నారు.
జిల్లాలో సుమారు 14 వేల
మంది పథకానికి దూరం
వసూలు చేస్తున్నాం..
అర్హత ఉండి గృహజ్యోతి అమలుకాని వినియోగదారులు మున్సిపాలిటీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో నమోదు చేసుకుంటేనే మాకు జాబితా వస్తోంది. సాంకేతిక కారణాలతో కొందరికి గృహజ్యోతి వర్తించడం లేదు. జిల్లాలో 13,658 మంది ఈ పథకానికి దూరంగా ఉన్నారు. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.1.75 కోట్ల బకాయిలు ఉన్న మాట వాస్తవామే. వాటిని చెల్లించాలని క్షేత్రస్థాయిలో వినియోగదారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. – రాజశేఖరం, ఎస్‌ఈ, విద్యుత్‌శాఖ