
నేడు డయల్ యువర్ డీఎం
వనపర్తి టౌన్: డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని గురువారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహించనున్నట్లు వనపర్తి డిపో మేనేజర్ వేణుగోపాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు తమ సమస్యలు, సలహాలు, సూచనలు, ఫిర్యాదులను సెల్‌నంబర్ 73828 26289కు ఫోన్ చేసి తెలుపాలని.. మెరుగైన సేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
గోదాం నిర్మాణానికి
స్థల పరిశీలన
పాన్‌గల్: మండల కేంద్రంలో మండలస్థాయి గిడ్డంగి (స్టాక్ పాయింట్ గోదాం) నిర్మాణానికి బుధవారం పౌరసరఫరాల జిల్లా మేనేజర్ జగన్మోహన్ స్థల పరిశీలన చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం సమీపంలోని స్థలంతో పాటు సర్వే నంబర్ 58లో ఉన్న స్థలాన్ని తహసీల్దార్ సత్యనారాయణరెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రూ.80 లక్షల వ్యయంతో 600 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం నిర్మాణానికి స్థలాన్ని పరిశీలిస్తున్నామని.. అనువుగా ఉండే స్థలాన్ని ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గోవిందరావు, ఎంపీఓ రఘురాములు, మండల, వనపర్తి స్టాక్ పాయింట్ ఇన్‌చార్జ్‌లు నాగరాజు, మహేష్, మండల కాంగ్రెస్ నాయకులు రాముయాదవ్, బ్రహ్మయ్య, వెంకటయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఆస్తి పన్ను రాయితీని
వినియోగించుకోవాలి
వనపర్తి టౌన్: పుర ప్రజలు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పథకంలో భాగంగా ఆస్తి పన్ను అపరాధ రుసుం (వడ్డీ)పై ప్రభుత్వం కల్పించిన 90 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని పుర కమిషనర్ వెంటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 31తో గడువు ముగియనుందని.. ఆస్తి, కొళాయి, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని పేర్కొన్నారు.
‘పది’ పరీక్షలకు
13 మంది గైర్హాజరు
వనపర్తి విద్యావిభాగం: జిల్లావ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీఈఓ అబ్దుల్ ఘని తెలిపారు. బుధవారం జిల్లాలోని 36 పరీక్ష కేంద్రాల్లో 6,853 మంది విద్యార్థులకుగాను 6,840 మంది విద్యార్థులు హాజరుకాగా.. 13 మంది గైర్హాజరైనట్లు వివరించారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు గంట ముందుగానే చేరుకోగా.. సిబ్బంది తనిఖీ చేసి కేంద్రాల్లోకి అనుమతించారు. పోలీసులు బందోబస్తు నిర్వహించగా.. ఉన్నతాధికారుల ఆదేశానుసారం అన్ని మండల కేంద్రాల్లో పరీక్ష సమయం ముగిసే వరకు జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచారు.
‘బాధిత రైతులను
ఆదుకోవాలి’
కొత్తకోట రూరల్: ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ఎండీ జబ్బార్ డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని కానాయిపల్లి శివారులో దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించి బాధిత రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని కానాయిపల్లి, సంకిరెడ్డిపల్లి, రాయినిపేట, వనపర్తి మండలంలోని క్రిష్టగిరి, నాసనల్లి, పెద్దమందడి మండలం మణిగిల్లలో 800 ఎకరాల వరి పంటకు నష్టం వాటిల్లిందని.. వివరాలు సేకరించి ఆదుకోవాలని కోరారు. ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి నష్టం వివరాలు అంచనా వేయించి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని కోరారు. ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతు భరోసా 60 శాతం ఇవ్వలేదని ఆరోపించారు. ఆయన వెంట రైతులు బక్క శ్రీను, కురుమన్న, వెంకటయ్య, మాసన్న, నర్సింహారెడ్డి, గోపాల్‌రెడ్డి, చిన్న నర్సింహులు, దామోదర్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నిక్సన్, వెంకటయ్య, కుర్మన్న, రాములు తదితరులు ఉన్నారు.

నేడు డయల్ యువర్ డీఎం