
చట్టాలపై అవగాహన అవసరం
వనపర్తి రూరల్: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ న్యాయమూర్తి రజని అన్నారు. మంగళవారం శ్రీరంగాపురం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించిన కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. అలాగే మోటారు వెహికల్ యాక్ట్, బాల కార్మిక చట్టం, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఉచిత న్యాయ సలహాల కోసం హెల్ప్‌లైన్ నంబర్ 15100 సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో సఖి లీగల్ కౌన్సిల్ డి.కృష్ణయ్య, ప్రధానోపాధ్యాయురాలు వాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు.