
సన్నబియ్యం పంపిణీపై పక్కాగా పర్యవేక్షణ
వనపర్తి: రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీని పక్కాగా పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సన్నబియ్యంలో దొడ్డుబియ్యం కలిపి పంపిణీ చేయరాదని.. అలాంటి పనులు ఎక్కడైనా చేసినట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తప్పవన్నారు. అక్రమాలకు పాల్పడితే రేషన్ డీలర్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. అదే విధంగా మరికొన్ని రోజుల్లో వరిధాన్యం కొనుగోలు ప్రారంభం కాబోతోందని.. అధికారులు ఎప్పటికప్పుడు ధాన్యం కొ నుగోలు వివరాలను సేకరించాలని సూచించారు. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు.
ఫిర్యాదులు త్వరగా పరిష్కరించండి
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంలతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 30 ఫిర్యాదులు అందగా.. పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు పంపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. ప్రజలకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తమ సమస్యలను తెలియజేసేందుకు వస్తుంటారని.. వారు ఇచ్చిన ఫిర్యాదులను నిశితంగా పరిశీలించి పరిష్కార మార్గం చూపాలని సూచించారు. సీఎం ప్రజావాణి ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.