వరంగల్ క్రైం: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానాల చెల్లింపు రాయితీ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించిన విషయం తెలిసిందే. మంగళవారంనుంచి జనవరి 10వ తేదీ వరకు పెండింగ్ జరిమానాలను రాయితీతో చెల్లించొచ్చు. దీంతో ప్రభుత్వానికి భారీ ఆదా యం రానుంది. దీంతోపాటు పెండింగ్ చలాన్ల పేరి ట ట్రాఫిక్ పోలీసులనుంచి ఎదురయ్యే ఇబ్బందునుంచి వాహనదారులకు విముక్తి లభించనుంది.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ రూ ల్స్‌ను అతిక్రమించిన వాహనదారుల జరిమానాలు భారీ మొత్తంలో పేరుకుపోయాయి. ఇటీవల ట్రైసిటీ పరిధిలోని మూడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లలో పనిచేసే అధికారులు, సిబ్బంది నగరంలోని వాహనదారులనుంచి జరిమానాలను ముక్కుపిండి వసూలు చేశారు. జరిమానాల్లో 50 శాతం చెల్లిస్తేనే వాహనాలను వదిలిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రాయితీ అవకాశాన్ని వాహనదారులు వినియోగించుకుంటే ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది.
అందరూ చెల్లిస్తే రూ.80కోట్లు వసూలయ్యే అవకాశం..
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలు ఉన్నాయి. 2018 జనవరి ఒకటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకింద 47,31,823 చల్లాన్లు ఉండగా, జరిమానా రూ.140,91,52,550 విధించారు. గత మార్చి నెలలో రాష్ట్ర ప్రభుత్వం రాయితీ కల్పించిన సమయంలో, పోలీస్ అధికారులు వాహనాల తనిఖీల సందర్భంగా 20,17,109 చల్లానకుగాను రూ.62,72,66,426 వసూలయ్యాయి. మిగిలిన చలాన్లు 27,14,714 ఉండగా, జరిమానా రూ.80,18,86,124 పెండింగ్‌లో ఉంది. కాగా, ఈ ఏడాది జనవరినుంచి ఈ నెల 25వ తేదీ వరకు వరంగల్ కమిషనరేట్ పోలీసులు ద్విచక్ర వాహనాలపై 5,73,436, ఆటోలపై 20,700, కార్లపై 1,15,421, లారీలపై 938, భారీ వాహనాలపై 2081, మొత్తం 7,14,720 చలాన్లు విధించారు.
వాహనాలపై రాయితీ ఇలా....
బైక్‌లు, ఆటోలపై 80శాతం, కార్లు, ట్రక్కులు, భారీ వాహనాలపై 60 శాతం, ఆర్టీసీ, తోపుడు బండ్లపై 90 శాతం రాయితీని ప్రభుత్వం కల్పించింది.
రాయితీ అవకాశాన్ని వినియోగించుకోవాలి
ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ అవకాశం కల్పించింది. చలాన్లు ఉన్న వాహనదారులు తప్పకుండా వినియోగించుకోవాలి. వాహనదారులు ఎట్టిపరిస్థితుల్లోనూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించొద్దు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు. అతివేగంగా ప్రయాణించి ప్రమాదాలకు గురికావద్దు. వాహనదారులు నిబంధనలను పాటిస్తూ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలి.
– సీపీ అంబర్ కిషోర్ ఝా
ఇష్టారాజ్యంగా చలాన్ల విధింపు..
కమిషనరేట్ పరిధిలో వాహనదారులపై పోలీస్ అధికారులు విధించిన చలాన్లపై సర్వతా విమర్శలు వెల్లువెత్తాయి. ఉదయం సమయంలో వాకింగ్‌వెళ్లొచ్చే వాహనదారులపైనా విత్‌అవుట్ హెల్మెట్‌కింద జరిమానాలు విధిస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా నగరంలో ప్రత్యేకంగా ఎక్కడ కూడా పార్కింగ్ స్థలాలు లేవు. కానీ ట్రాఫిక్ పోలీసులు వాహనాలను రోడ్డు పక్కన నిలిపితే నో పార్కింగ్ పేరిట జరిమానాలు విధించారు.
ట్రాఫిక్ నిబంధనలను తెలియజేసే సైన్ బోర్డులు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ జరిమానాలు మాత్రం అంతటా వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రాఫిక్‌లో పనిచేసే కొంతమంది రోడ్డు పక్కనే పార్కింగ్ చేసిన వాహనాల ఫొటోలు తీసి చలాన్లు పంపించే పనికి మాత్రమే పరిమితమయ్యారన్న విమర్శలు లేకపోలేదు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సిబ్బంది చాలామంది జరిమానాల విధింపుపైనే దృష్టి కేంద్రీకరించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment