
సమీక్షిస్తున్న మండలి చైర్మన్ మోషేన్‌రాజు
సాక్షి, పశ్చిమగోదావరి: రాష్ట్రంలోని శాసనమండలి సభ్యుల సదస్సుకు పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం వేదిక కానుంది. ఈ నెల 31న జరిగే ఎమ్మెల్సీల సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లపై మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ యు.రవిప్రకాష్‌తో సమీక్షించారు. రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 58 మంది ఎమ్మెల్సీలు సదస్సుకు హాజరవుతారని అంచనా. రాష్ట్రస్థాయి సదస్సు నేపథ్యంలో పట్టణంలో బందోబస్తు, పారిశుద్ధ్య నిర్వహణ, అతిథులకు ఆహ్వానం స్థానికంగా ఉన్న చర్చి, మసీదు, ఆలయాల సందర్శన తదితర అంశాల్లో లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని చైర్మన్ మోషేన్‌రాజు అధికారులకు ఆదేశాలిచ్చారు.
మండలి విధివిధానాలు, క్వశ్చన్ అవర్, షార్ట్ డిస్కషన్‌న్, సభలో సభ్యులు వ్యవహరించాల్సిన తీరు, అనుసరించాల్సిన నిబంధనలు, సూచనలు తదితర అంశాలపై సదస్సులో సభ్యులకు అవగాహన కల్పిస్తామన్నారు. చాలా ఏళ్ల కిందట రాష్ట్రస్థాయి సదస్సు జరగ్గా, తాజాగా తమ మండలిలో భీమవరంలో సదస్సు నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. అందుకోసం బీవీ రాజు కళాశాల ఆవరణను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పి.పి.కె.రామాచార్యులు, జాయింట్ సెక్రటరీ విజయ రాజు, సహాయ కార్యదర్శులు శ్రీనివాసరావు, విశ్వనాథ్, పశ్చిమగోదావరి డీఆర్‌వో బి.శివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.