నాచుపువ్వుతో తంటా
భీమవరం: దాళ్వా వరిచేలలో విచ్చలవిడిగా పెరుగుతున్న నాచుపువ్వు రైతులకు సంకటంగా మారింది. నీటి ద్వారా వచ్చే నాచుపువ్వు నాట్లు వేసిన పొలాల్లో విస్తారంగా వ్యాపించడంతో రైతులు దానిని తొలగించడానికి తీవ్ర ఇబ్బందులకు గురికావడమేగాక పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత దాళ్వా సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో 2.25 లక్షల ఎకరాల్లో వరిసాగుచేయాల్సి ఉండగా దాదాపు 95 శాతానికిపైగా నాట్లు పూర్తయ్యాయి. ముందుగా నాట్లువేసిన ప్రాంతంలో మొదటి విడత ఎరువులు వేయడం పూర్తిచేసి కలుపుతీసే పనిలో నిమగ్నమయ్యారు. కొంత ఆలస్యంగా నాట్లు వేసిన భూముల్లో నాచుపువ్వు పెరగడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నాచుపువ్వు భూమి మొత్తం వ్యాప్తి చెందడంతో కూలీలతో తొలగించడానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. నాచుపుప్వు కారణంగా పైరుకు వేసే ఎరువులు, గుళికలు వంటివి భూమికి చేరకుండా పువ్వులపై ఉండడంతో ఎరువులు వేసినా ప్రయోజనం లేకుండా పోతుందని వాపోతున్నారు. నాచుపువ్వు దట్టంగా అలుముకోవడం, త్వరితగతిన విస్తరించడం వల్ల భూమిలోని సారాన్నికూడా గ్రహించడం వల్ల వరిపైరు ఎదుగుదల లోపిస్తోందని రైతులు చెబుతున్నారు. కాలువల్లోని నీటి ద్వారా వచ్చే నాచుపువ్వు నివారణకు ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరిచేలలో కలుపుతోపాటు నాచుపువ్వు కూలీలతో తొలగించడానికి ఎకరాకు రూ.4 వేల వరకు ఖర్చు అవుతోందని, ఒకసారి తొలగించే సమయంలో ఎక్కడైనా చిన్న పువ్వు మిగిలినా అది మరింత విస్తరిస్తోందని రైతులు చెబుతున్నారు.
నివారణ చర్యలు ఇలా
వరిచేలలో నాచుపువ్వు (ఫిస్టియా) నివారణకు టుపార్టీ సోడియం సాల్ట్ మందును పిచికారీ చేయాలని ఉండి కృషి విజ్ఞాన కేంద్రం హెడ్ ఎన్ మల్లిఖార్జునరావు చెప్పారు. రెండు గ్రాముల మందును లీటరు నీటిలో కలిపి పువ్వు పూర్తిగా తడిచే విధంగా పిచికారీ చేయాలన్నారు. మందును పిచికారీ చేసే సమయంలో ఇతర కూరగాయలు వంటి మొక్కలకు తగలకుండా చర్యలు తీసుకోవాలని, మొక్కలకు మందు తగిలితే అవికూడా చనిపోయే ప్రమాదముందన్నారు. నాచుపువ్వు నీటి ద్వారా వస్తున్నందున కాలువల నుంచి చేలలోనికి నీరు వచ్చే ప్రాంతంలో నెట్ వంటిది ఏర్పాటు చేసుకుంటే నాచుపువ్వు చేలలోనికి రాకుండా అడ్డుకోవచ్చునన్నారు.
దాళ్వా వరిచేలల్లో విస్తరిస్తున్న నాచుపువ్వు
ఎరువులు భూమికి చేరడం లేదని రైతుల ఆందోళన
నాచుపువ్వు తొలగింపు అదనపు భారంగా మారిందని ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment