భారీ కోడిపందేల శిబిరంపై దాడి
ముసునూరు: అధికారం అండతో లోపూడిలో అర్ధరాత్రి యథేచ్ఛగా నిర్వహిస్తున్న భారీ కోడి పందేల శిబిరంపై పోలీసులు మెరుపు దాడిచేశారు. ఈ దాడిలో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకోగా, వారివద్ద నుంచి రూ.42,400, 40 బైకులు, 12 కోడి పుంజులు, నాలుగు కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ఎం.చిరంజీవి తెలిపారు. వివరాల ప్రకారం.. లోపూడిలోని ఓ మామిడి తోటలో బుధవారం రాత్రి అతి రహస్యంగా జరుగుతున్న కోడిపందేలపై ముసునూరు ఎస్సై చిరంజీవి, చాట్రాయి ఎస్సై రామకృష్ణ, సిబ్బందితో కలసి ముప్పేట దాడి చేశారు. గ్రామానికి చెందిన, పందేల నిర్వాహకులైన అధికార పార్టీ శ్రేణులు పారిపోగా, తొమ్మిది మందిని అదుపులోనికి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు. పోలీసుల దాడి సమయానికి తోటలో ఉన్న వందలాది జూదరులు బరి చుట్టుపక్కల ఉన్న పొగాకు, మొక్కజొన్న, మిర్చి తోటలను తొక్కుకుంటూ పారిపోవడంతో పంటలు పాడయ్యాయని సమీప రైతులు ఆవేదన చెందుతున్నారు. మరికొందరు చెక్కపల్లి వైపు పారిపోతూ ఉండగా కారు పల్టీకొట్టి అందులోని వారు గాయాలపాలైనట్లు స్థానికులు చెబుతున్నారు. అధికారం అండగా అదే తోటలో సంక్రాంతి అనంతరం నిత్యం కోడి పందేలు నిర్వహిస్తూ, ఇతర జిల్లాల నుంచి కూడా పందెంరాయుళ్లను రప్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. పారిపోయిన టీడీపీ శ్రేణులు నిర్వాహకులను సైతం అరెస్టు చేయాలని పలువురు కోరుతున్నారు. పట్టుబడిన వారిని శుక్రవారం కోర్టుకు తరలిస్తామని పోలీసులు చెప్పారు.
9 మంది అరెస్ట్.. 40 బైకులు, నగదు స్వాధీనం
పారిపోయిన నిర్వాహకులు, టీడీపీ శ్రేణులు
Comments
Please login to add a commentAdd a comment