జంగారెడ్డిగూడెం: గ్రామాలను ఖాళీ చేయించి భూములు ఇచ్చిన గిరిజనులకు పరిహారం ఇచ్చాకే ప్రాజెక్టు పూర్తి చేయాలని పోలవరం నిర్వాసితుల యాత్ర బృందం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రంపచోడవరం జిల్లాలో ప్రారంభమైన నిర్వాసితుల యాత్ర గురువారం జంగారెడ్డిగూడెం చేరుకుంది. స్థానిక బస్టాండ్ సెంటర్లో ఈ యాత్ర బృందానికి సీపీఎం జంగారెడ్డిగూడెం మండల, పట్టణ కమిటీలు ఘనస్వాగతం పలికాయి. అనంతరం బస్టాండ్ సెంటర్లో నిర్వాసితుల యాత్ర రాష్ట్ర నాయకులు కామ్రేడ్ దడాల సుబ్బారావు లోత రామారావు మాట్లాడుతూ లక్షల కోట్ల రూపాయల నిధులను ప్రాజెక్టు కట్టడానికి వెచ్చిస్తున్నారే తప్ప, భూమిలిచ్చి గ్రామాలు ఖాళీ చేసిన నిర్వాసితులకు గిరిజనులకు పరిహారం ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. సీపీఎం పార్టీ రాష్ట్ర 27వ మహాసభలు నెల్లూరులో ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో జరుగుతున్నాయని, ఈ మహాసభల్లో పోలవరం నిర్వాసితుల సమస్యలపై చర్చించి తగు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ రవి కిషోర్ నాగమణి, యాత్ర బృందం, మండల కార్యదర్శి ఎం జీవరత్నం పట్టణ కన్వీనర్ పి సూర్యారావు, పాల్గొన్నారు.
కుక్కునూరుకు చేరిన యాత్ర
కుక్కునూరు: పోలవరం నిర్వాసితుల పోరాట పతాక జీపు యాత్ర గురువారం కుక్కునూరుకు చేరింది. ఈ సందర్భంగా రామసింగారం సెంటర్లో జాతనుద్దేశించి సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు మాట్లాడారు. కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయల దోచిపెట్టేలా ప్రాజెక్టు నిర్మాణం పై ఉన్న శ్రద్ధ ప్రభుత్వాలకు నిర్వాసితులకు చెల్లించే పునరావాస పరిహారంపై లేకపోవడం సరి కాదన్నారు. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం ప్రతి నిర్వాసితుడికి రూ.15 లక్షలు పునరావాస పరిహారం ఇవ్వాలని నిర్వాసితులకు పూర్తి పరిహారం చెల్లించే వరకు ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలిపివేయాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ రవి మాట్లాడుతూ 2022 గోదావరి వరదలను ప్రామాణికంగా తీసుకొని మండలం యూనిట్ గా తీసుకోని ప్రతి నిర్వాసితుడికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా కమిటీ సభ్యులు వై నాగేంద్రరావు, పోలవరం మండల నాయకులు తాటి శాంతకుమారి ఎం వీరాయమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment