ప్రశాంతంగా సర్టిఫికెట్ కోర్సు పరీక్ష
భీమవరం: భీమవరంలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు(డ్రాయింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్) పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఎస్‌సీహెచ్‌బీఆర్‌ఎమ్ స్కూలు పరీక్షా కేంద్రంలో ఉదయం, మధ్యాహ్నం నిర్వహించిన డ్రాయింగ్ లోయర్ పరీక్షకు 70 మందికి 52 మంది, హయ్యర్ పరీక్షకు 29 మందికి 24 మంది హాజరయ్యారు. టైలరింగ్, ఎంబ్రాడయిరీ లోయర్ పరీక్షకు 29 మందికి 21 మంది, హయ్యర్ పరీక్షకు 12 మందికి 10 మంది హాజరయ్యారు.
భీమవరంలోనే కలెక్టరేట్ నిర్మాణం
భీమవరం: జిల్లా కేంద్రమైన భీమవరంలోనే కలెక్టరేట్ నిర్మాణం జరుగుతుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్పష్టం చేశారు. బుధవారం భీమవరంలో మాట్లాడుతూ కలెక్టరేట్ తరలిపోతుందనేది కేవలం అపోహమాత్రమేనన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం మంజూరు చేసిన ప్రత్యేక ప్యాకేజీ రూ.11,400 కోట్లు అమలు చేసేందుకు విధి విధానాలు వేగవంతం చేశామని, స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే ఆలోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్‌లో సమస్యలు పరిష్కరించి 7.3 మిలియన్ల స్టీల్ ఉత్పత్తి లక్ష్యం చేరుకుంటామన్నారు. స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులకు వీఆర్‌ఎస్ అమలు చేస్తున్నామని ఇంతవరకు 1, 613 మంది వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోగా 1,141 మంది అర్హులుగా గుర్తించారన్నారు. మార్చి 31 నాటికి వీఆర్‌ఎస్ స్కీం అమలు పూర్తి చేయాలని నిర్ణయించగా తొలి విడతగా దరఖాస్తు చేసుకున్న 150 మందికి మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వబోతునట్లు కేంద్రమంత్రి చెప్పారు.
ఛత్రపతి శివాజీకి నివాళులు
భీమవరం: భీమవరం పట్టణంలో మరాఠీ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ముఖ్యఅతిథిగా విచ్చేసి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడారు. శివాజీ దేశానికే ఆదర్శమైన మహారాజని, మహిళల పట్ల అతను చూపిన గౌరవం, రాజ్య పరిపాలన దక్షత సువర్ణాధ్యాయంగా నిలిచాయన్నారు. కార్యక్రమంలో మరాఠీ సంఘం నాయకులు చంద్రశేఖర్, శ్రీవిద్య, అల్లు శ్రీనివాస్, మటపర్తి మురళీకృష్ణ, ఇళ్ల హరికృష్ణ, వనమా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
21లోగా ఎమ్మెల్సీ ఓటరు స్లిప్పుల పంపిణీ
ఏలూరు(మెట్రో): తూర్పు, పశ్చిమగోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల స్లిప్పుల పంపిణీ కార్యక్రమాన్ని ఈనెల 21లోగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు జిల్లాలో ఇప్పటి వరకు 16 వేల ఓటరు స్లిప్పులను పంపిణీ చేశారని, మిగిలిన వాటిని ఈ నెల 21లోగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
రీ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో భూముల రీ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. బుధవారం విజయవాడ నుంచి భూముల రీసర్వేపై సీసీఎల్‌ఏ జి.జయలక్ష్మి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీసీఎల్‌ఏ మాట్లాడుతూ రీసర్వేపై ప్రత్యేక శ్రద్ధ వహించి నివేదికలు పంపాలన్నారు. రీసర్వే రెవెన్యూ శాఖలో అతి ముఖ్యమైన అంశమని.. ఎలాంటి జాప్యం, నిర్లక్ష్యం వహించరాదన్నారు. అనంతరం కలెక్టర్ నాగరాణి సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సిన పౌర సేవలు సంతృప్తి స్థాయిలో అందాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు ప్రతి ఒక్కరు నిబద్ధతతో పనిచేయాలన్నారు. రీ సర్వే వేగవంతంగా, నిర్వహించి నివేదికలు సమర్పించాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment