భీమవరం: జిల్లాలో ఇళ్లు, టిడ్కో ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పట్టాల సమస్యలను తక్షణం పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ప్రజా చైతన్య సైకిల్ యాత్ర ముగింపు సందర్భంగా సోమవారం భీమవరంలో కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని, దేశాన్ని ఏలుతున్న ప్రముఖులు జిల్లాలోనే ఉన్నా పేదల ఇళ్ల సమస్యలను పట్టించుకునే నాథుడే లేకపోవడం బాధాకరమన్నారు. జిల్లాలో 20 వేలకు పైగా టిడ్కో ఇళ్లలో కనీస సౌకర్యాలు లేవని మండిపడ్డారు. ప్రజల డబ్బులతో కట్టించిన టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు స్వాధీనం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కల్లబొల్లి హామీలిచ్చి ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన ప్రజా ప్రతినిధులు ఇప్పుడు ప్రజల్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జిల్లా కార్యదర్శి జేఎన్‌వీ గోపాలన్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ కాలనీలు ప్రతిపక్ష కాలనీలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నేటికీ సమస్యల వలయంగా ప్రభుత్వ కాలనీలు ఉన్నాయని రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, మంచినీరు వంటి కనీస సౌకర్యాలు లేవన్నారు. కనీసం చెత్త బండి, రైస్ బండి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ చేపడతామన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లుకు అందజేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.బలరామ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతకాయల బాబురావు, కౌరు పెద్దిరాజు, కర్రా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.